ముంబై, మార్చి 29
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , 2 వేల రూపాయల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ, ఇప్పుడు కూడా వేల కోట్ల విలువైన పింక్ నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇప్పటికీ పెద్ద నోట్ల డిపాజిట్లను అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి, ఆర్‌బీఐ ఒక అప్‌డేట్ ఇచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున, అంటే 01 ఏప్రిల్ 2024న, రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని RBI ప్రకటించింది. ఏప్రిల్ 01న, తన 19 ఇష్యూ కార్యాలయాలు వార్షిక ఖాతాల ముగింపులో బిజీగా ఉంటాయని, ఆ రోజున రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం కుదరదని కేంద్ర బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రూ.2000 నోట్లను ఏప్రిల్ 02, 2024 నుంచి డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 28న (గురువారం) RBI ఈ ప్రకటన విడుదల చేసింది.2023 మే 19న, మార్కెట్ నుంచి రూ.2000 నోట్ల ఉపసంహణ నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ తేదీ నాటికి మార్కెట్‌లో దాదాపు రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. RBI లెక్క ప్రకారం, 2024 ఫిబ్రవరి 29 నాటికి, ఈ మొత్తం రూ. 8470 కోట్లకు తగ్గింది. అంటే, చలామణీలో ఉన్న మొత్తం రూ. 2000 నోట్లలో 97.62% RBI వద్దకు తిరిగి వచ్చింది. ఇంకా 2.38% నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి, వీటి విలువ రూ. 8,470 కోట్లు.రూ. 2000 నోట్లను RBI వెనక్కు తీసుకుంది గానీ రద్దు చేయలేదు. అవి ఇప్పటికీ చెల్లుతాయి. 2000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని ఆర్‌బీఐ చాలాసార్లు స్పష్టం చేసింది. రెండు వేల నోట్ల చట్టబద్ధతను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేయకపోయినా, వాటిని లావాదేవీల కోసం ఇప్పుడు ఎవరూ వినియోగించడం లేదు.రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. మీకు దగ్గరలోని పోస్టాఫీస్ నుంచి, దేశంలోని 19 RBI ఇష్యూ ఆఫీసుల్లో దేనికైనా 2 వేల రూపాయల నోట్లను పంపవచ్చు. ఆన్‌లైన్‌లో లభించే అప్లికేషన్‌ను పూర్తి చేసి, ఆ దరఖాస్తును & ఖాతాలో జమ చేయాలనుకున్న రూ.2 వేల నోట్లను పోస్టాఫీస్‌లో ఇస్తే చాలు. తపాలా సిబ్బంది వాటిని ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు ) పంపుతారు. ఆ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. పోస్టాఫీస్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి, మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. దీనివల్ల, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది, సమయం మిగులుతుంది. పోస్టాఫీస్ ద్వారా పంపకూడదనుకుంటే, నేరుగా ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు వెళ్లి రూ.2000 నోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు.