YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమస్యల్లో దవాఖానాలు

 సమస్యల్లో దవాఖానాలు
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు 24 గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉండడం లేదని కర్నూలు వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు సమర్ధవంతమైన వైద్య సేవలు ఎల్లవేళలా దక్కేలా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నేరవేరడంలేదని వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల లేమి, వైద్యులు, సిబ్బంది కొరత, మందులు కొరత ప్రధాన లాంటివి సమస్యాత్మకంగా మారాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఇబ్బందులు చాలదన్నట్లు సిబ్బందిపై పర్యవేక్షణ సైతం కొరవడిందని దీంతో ఆసుపత్రుల్లో ఎవరు ఉంటున్నారో.. ఎవరెవరు వచ్చి పోతున్నారో తెలీని దుస్థితి నెలకొందని అంటున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని స్థానికులు వైద్య విభాగం ఉన్నతాధికారులను కోరుతున్నారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 534 ఆరోగ్య ఉపకేంద్రాలు, 20 సిహెచ్‌సిలు, రెండు జిల్లా ఆస్పత్రులున్నాయి. జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాయంత్రం 4 దాటితే సిబ్బంది ఎవరూ ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం ఒక హెల్త్‌ అసిస్టెంట్‌, ఒక ఆయా మాత్రమే ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. వైద్యులు గానీ, స్టాఫ్‌ నర్సుగాని, ఫార్మసిస్టు గానీ ఉండక పోవడంతో రోగులు నానాపాట్లు పడాల్సి వస్తోంది. చికిత్స చేసేందుకే కాక కనీసం మందులిచ్చే దిక్కు లేకుండా పోతోందని చెప్తున్నారు. ఏ చిన్న రోగం వచ్చినా బాధితులు జనరల్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారని వివరిస్తున్నారు. 
 
రెగ్యులర్‌గా అవసరమైన మందులు జిల్లాలోని అన్ని పిహెచ్‌సిల్లో లేని దుస్థితి నెలకొన్నట్లు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. నొప్పులకు అవసరమైన డైక్లోఫినాక్‌ ఇంజక్షన్‌, అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ సిరప్‌, బి.కాంప్లెక్స్‌, మిథిల్‌ కొబాలమెంట్‌, కాల్షియం టాబ్లెట్లు పూర్తిస్థాయిలో ఉండడం లేదని అంటున్నారు.  ప్యారాసిటమల్‌ 500 ఎంజి ట్యాబెలెట్లు మాత్రమే ఉంటున్నట్లు సమాచారం. రోలార్‌ బ్యాండేజిలు, గ్యాస్‌ సమస్యలు, కడుపులో మంటకు వాడే ఇంజక్షన్లు, రాన్‌టాక్‌ మందులు లేవనీ పలువురు చెప్తున్నారు. కొన్ని పిహెచ్‌సిల్లో పాము కాటు, కుక్క కాటుకు కూడా వ్యాక్సిన్లు లేకపోవడంతో బాధితులు జిల్లా ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు. ఇదిలాఉంటే ఆరోగ్య ఉప కేంద్రాలకు వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రోగులను పాట్లు తప్పడంలేదు. ప్రభుత్వం అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంచినా బాధితులకు సమర్ధవంతమైన వైద్యం లభించని దుస్థితి. జిల్లాలోని 534 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో మరో 20 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వ, వైద్య విభాగం పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts