న్యూఢిల్లీ, మార్చి 29
ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఏఐ టెక్నాలజీ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకూ పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఏఐ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే ఈ సాంకేతికతను చాలా మంది దుర్వినియోగం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని సరిగ్గా వాడితే అంతకు మిచ్చిన మ్యాజిక్ టూల్ ఏమీ ఉండదని అన్నారు. ఏఐ తో జనరేట్ చేసిన కంటెంట్‌కి కచ్చితంగా వాటర్‌మార్క్ వేయాలని, తద్వారా డీప్‌ఫేక్ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశముంటుందని సూచించారు. "ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి మంచి టెక్నాలజీని సరైన శిక్షణ ఇవ్వకుండానే చేతుల్లో పెడితే కచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. ఏఐతో జనరేట్ చేసిన కంటెంట్‌పై కచ్చితంగా వాటర్ మార్క్ వేయాలి. అలా అయితేనే దాన్ని మిస్‌యూజ్ చేయకుండా అడ్డుకోగలం. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడేందుకు వెసులుబాటు ఉంది. అసలు ఈ డీప్‌ఫేక్ కంటెంట్‌ని గుర్తించడమే సవాల్‌గా ఉంది. కచ్చితంగా ఈ టెక్నాలజీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి"ఇటీవల కొంత మంది ప్రముఖుల వీడియోలు డీప్‌ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు. ఇవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ వీడియో ఫేక్ అని గుర్తించడానికి కూడా వీల్లేనంత కచ్చితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ టెక్నాలజీ గురించి ప్రస్తావించడం కీలకంగా మారింది. ChatGPT లాంటి ఏఐ టూల్స్‌ని ప్రొడక్టివిటీ పెంచేందుకు మాత్రమే వినియోగించాలని సూచించారు ప్రధాని. కానీ కొంత మంది వీటిని వేరే విధంగా వాడుకుంటూ తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అటు బిల్ గేట్స్ కూడా ఏఐ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఊహించని పనులనూ పూర్తి చేస్తున్న ఈ సాంకేతికత...కొన్ని విషయాల్లో మాత్రం విఫలమవుతోందని అన్నారు. ఎన్నో సవాళ్లను దాటాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.