YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద చేపల కోసం వల...

ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద చేపల కోసం వల...

హైదరాబాద్, మార్చి 30
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ శాఖ మరో కీలక పరిణామానికి నాంది పలికింది. గత ప్రభుత్వంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ విభాగానికి డీసీపీగా పనిచేసి, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా పనిచేసిన రాధా కిషన్ రావు ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు.. అంతకుముందు రాధా కిషన్ రావును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో గేట్లు మొత్తం మూసేసి ఆయనను విచారించారు. ఈ విచారణకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధా కిషన్ రావును పోలీసులు పలు విషయాలపై విచారించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ప్రణీత్ రావు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు నివాసాలలో పోలీసులు కొద్దిరోజుల క్రితం తనిఖీలు చేశారు. అయితే ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. వీరిపై ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.రాధా కిషన్ రావు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన హయాంలో క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విదేశాల నుంచి పరికరాలు ఎవరు తెప్పించారు? ఎందుకోసం తెప్పించారు? దీని వెనక ఎవరున్నారు? ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు? ప్రణీత్ రావుతో ఎన్ని ఆపరేషన్లు చేయించారు? ఎంతమంది వ్యాపారులను బెదిరించారు? ఆ డబ్బు వసూలులో ఎవరు కీలకపాత్ర పోషించారు? ఆ డబ్బుతో ఏమేం చేశారు? వంటి అంశాల పై పోలీసులు రాధా కిషన్ రావును ప్రశ్నించారు. రాధా కిషన్ రావును ప్రశ్నించిన అనంతరం టాస్క్ ఫోర్స్, ఎస్ఐబీ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన గట్టు మల్లును కూడా పోలీసులు బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై అతడిని కూడా ప్రశ్నించారు..ఓ ఉన్నతాధికారి ఆయన స్టైల్ లో విచారించడంతో గట్టు మల్లు కీలక విషయాలు వెల్లడించినట్టు ప్రచారం జరుగుతున్నది.రాధా కిషన్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో సుదీర్ఘకాలం పనిచేసినందు వల్ల ఆయన బృందం పరి తీరుపై ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను వీరు గారికి తెచ్చేవారని విమర్శలున్నాయి. రాధా కిషన్ రావు పై పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. రాధా కిషన్ రావు మల్కాజ్ గిరి ఏసీపీగా ఉన్నప్పుడు వేధింపులకు గురి చేయడంతో ఒక కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ అనంతరం ఆయన ఆ కేతు నుంచి బయటపడ్డారు. రాధా కిషన్ రావు ఉద్యోగం నుంచి విరమణ పొందినప్పటికీ ఆయన టాస్క్ ఫోర్స్ విభాగంలో కీలకంగా పని చేశారు. నగర కమిషనర్ గా ఎవరున్నప్పటికీ.. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో రాధా కిషన్ రావు కే అధిక ప్రాధాన్యం దక్కేది. రిటైర్మెంట్ అయినప్పటికీ ఆయన రెండుసార్లు ఓఎస్డీ గా పనిచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో రాధా కిషన్ రావు పై అప్పటి కమీషనర్ సందీప్ కుమార్ శాండిల్య ఎన్నికల కమిషనర్ కు ప్రత్యేక నివేదిక పంపించడంతో ఆయనను టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తొలగించారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాధా కిషన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. రాధా కిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలో బేగం బజారుకు చెందిన కొంతమంది వర్తకులు అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. బేగంబజార్ ప్రాంతంలో హవాలా, గంజాయి దందా ఎక్కువగా సాగుతుంది. ఈ దందాలలో కీలకంగా ఉన్న వారితో రాధా కిషన్ రావు, గట్టుమల్లు ఆర్థిక లావాదేవీలు కొనసాగించారని ఆరోపణలు ఉన్నాయి. రాధా కిషన్ రావు మాత్రమే కాకుండా మరో ముగ్గురు టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.. వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కూడా రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం.ప్రణీత్ రావుకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తితో పాటు ఒక కానిస్టేబుల్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 4న ఎస్ఐబీలో హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి.. వాటిని మూసి నదిలో పారేసినట్టు సమాచారం. ఆ ఘటనలో వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయి చంచల్గూడా జైల్లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఏప్రిల్ 2 వరకు వారు పోలీస్ కస్టడీలో ఉంటారు. అయితే ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Related Posts