విశాఖపట్టణం, ఏప్రిల్ 1
విశాఖ విమానాశ్రయంపై నేవీ విధించిన ఆంక్షలు సడలించారు. ఎయిర్‌పోర్ట్ రన్‌వే మరమ్మతుల కోసం గత నాలుగు నెలలుగా పనులు జరుగుతున్నాయి. రన్ వే ఉపరితలంపై రీ సర్ఫేసింగ్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో విమానాల రాకపోకలపై గతంలో నేవీ విధించిన ఆంక్షలను తొలగించింది.విశాఖపట్నంవిమానాశ్రయంలో 24 గంటలు రాక పోకలకు అవకాశం కల్పిస్తామని విమానయాన సంస్థలకు భారత నేవి సమాచారం అందించింది. దీంతో విమాన యాన సంస్థలు వేసవి షెడ్యూళ్లను రూపొందించాయి.ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయానికి నిత్యం 30కు పైగా విమానాలు రాకపోకలు సాగుతున్నాయి. మరో నాలుగు షెడ్యూల్ ఖరారు చేశాయి. ఏప్రిల్ నుంచి మరో నాలుగు అదనపు సర్వీసులు విశాఖపట్నం నుంచి బయల్దేరే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.వీటిలో ఒకటి ఢిల్లీకి, మరొకటి హైదరాబాద్‌కు నడుపనున్నారు. విశాఖ నుంచి రాత్రి సమయాల్లో హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు విమానాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా ఉంటోంది. ఏపీలో ప్రధాన విమానాశ్రయం కావడంతో సర్వీసుల్ని పెంచేందుకు విమానయాన సంస్థలు కూడా సుముఖత తెలిపాయి.హైదరాబాద, ఢిల్లీ నగరాల నుంచి సాయంత్రం వేళల్లో రాకపోకలకు సర్వీసులు కావాలని విశాఖ విమాన ప్రయాణికుల సంఘం విజ్ఞప్తి చేయడంతో సాయంత్రం వేళల్లో కొత్త సర్వీసుల్ని ప్రారంభిస్తున్నారు. దీంతో విశాఖ నుంచి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు అంతర్జాతీయ సర్వీసుల సంఖ్య 34కు చేరింది.అందరికి అనుకూలంగా ఉండే సమయాల్లో కొత్త సర్వీసులు ప్రారంభించ నున్నట్లు విమాన యాన సంస్థలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి బయల్దేరే విమానం రాత్రి 10.55 గంటలకు విశాఖపట్నం వచ్చి తిరిగి 11.35 గంటలకు తిరుగు ప్రయాణం అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చే విమానం రాత్రి 8.10 గంటలకు విశాఖ వస్తుంది. తిరుగు ప్రయాణంలో నుంచి 8.55 గంటలకు బయలుదేరి వెళుతుంది.అంతర్జాతీయ సర్వీసుల్ని పునరుద్దరించేందుకు కూడా విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా ఆంక్షల కారణంగా గతంలో మలేషియాకు నడిపిన మలిండో సర్వీసులు నిలిపివేశారుఎయిర్ ఏషియా సంస్థ ఏప్రిల్ 26వ తేదీ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాలు నడుపనున్నట్టు ప్రకటించింది. మలేషియా విమానం రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం వస్తుంది. తిరిగి 10 గంటలకు మలేషియాకు బయలుదేరి వెళుతుంది.థాయ్‌ల్యాండ్ - బ్యాంకాక్ ప్రయాణించే విమానం ఏప్రిల్ 9వ తేదీ నుంచి సేవలు ప్రారంభిస్తుంది. వారానికి మూడు రోజులు పాటు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. బ్యాంకాక్ నుంచి వచ్చే విమానం రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం రానుంది. తిరుగు ప్రయాణంలో ఇదే విమానం అర్ధరాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి బెంగుళూరు, ముంబై , హైదరాబాద్, విజయవాడతో పాటు దేశంలోని పలు నగరాలకు విమనా సర్వీసుల్ని నడుపుతున్నారు. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.