ఏలూరు, ఏప్రిల్ 2
ఏలూరులో దిగ్భ్రాంతి కలిగించే వ్యవహారం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన రోగుల్ని ఏమార్చి మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న వైద్యుడి ఉదంతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులకు మత్తు మందులిచ్చి దోపిడీలకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఏలూరు శివార్లలోని చొదిమెళ్లలో నివాసం ఉంటున్న బత్తిన మల్లేశ్వరరావుకు అదే గ్రామానికి చెందిన ఎంబిబిఎస్ వైద్యుడు కొవ్వూరు భానుచందర్‌తో పరిచయం ఉంది. వైద్యుడితో ఉన్న పరిచయంతో మల్లేశ్వరరావు ఇంటికి అప్పుడప్పుడు వెళ్లేవాడు ఈ క్రమంలో ఆయనకు మత్తు మందు మోతాదుకు మించి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి దోపిడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తారు. మల్లేశ్వరరావు మత్తులోకి జారుకున్న తర్వాత నగదు, నగలతో ఉడాయించినట్టు కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. చొదిమెళ్లకు చెందిన రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి బత్తిన మల్లేశ్వరరావు (63)కి డాక్టర్ భానుసుందర్‌తో పరిచయం ఉంది. ఎంబీబీఎస్ చదివిన తర్వాత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసే భానుచందర్‌కు, మల్లేశ్వరరావుతో సన్నిహితంగా మెలిగేవాడు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యం చేసే నెపంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి మత్తులోకి జారుకున్నాక, వారి వద్దనున్న డబ్బు దోచుకున్నాడనే ఆరోపణలు వైద్యుడిపై ఉన్నాయి. మత్తు ఇంజెక్షన్ల ప్రభావానికి బాధితులు అస్వస్థతకు గురై కోలుకునే వారు. ఈ తరహా ఘటనలపై ఏలూరు త్రీటౌన్, వన్‌టౌన్ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి పోస్టల్ ఉద్యోగి మల్లేశ్వరరావును దోచుకునే ఉద్దేశంతో గత డిసెంబరు 24న ఆయన ఇంటికి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఒక్కడే ఉండటంతో ఆయన ఇంజక్షన్ చేసినట్టు చెబుతున్నారు. మల్లేశ్వరరావు మత్తులోకి జారుకోగానే వైద్యుడు భానుచందర్ అతని ఇంట్లోకి వెళ్లి బంగారు నగలు, కొంత నగదు అపహరించుకు పోయాడు. ఇంజెక్షన్ ప్రభావానికి మల్లేశ్వరరావు కోలుకోలేక చనిపోయాడు. అతని కుటుంబసభ్యులు తొలుత సహజ మరణంగా భావించారు. మల్లేశ్వరరావు మృతి చెందిన తర్వాత వైద్యుడు భానుసుందర్ ప్రవర్తనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో కుటుంబీకులు అతడిని నిలదీశారు. అప్పటినుంచి అతను గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మృతుడి కుమారుడు సోమశేఖర్ ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు