YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ పై మరో సర్జికల్ స్ట్రైక్....

కాంగ్రెస్ పై మరో సర్జికల్ స్ట్రైక్....

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2,
పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.. అధికార భారతీయ జనతా పార్టీ ప్రచార పర్వంలో మునిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రచారాన్ని చేపట్టనున్నారు.. ఇక మిగతా ప్రతిపక్షాలు కూడా తమ తమ స్థాయిలో ప్రచారాన్ని సాగిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అనే నినాదంతో మరోసారి నరేంద్ర మోడీ వినూత్న విధానంలో ప్రచారం చేస్తున్నారు. అదే దిశగా అడుగులు వేస్తున్నారు.. దీంతో కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలిపోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల ముందు ఆ పార్టీకి కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. రెండు రోజుల క్రితం 1823 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాజాగా మరో నోటీస్ ఐటీ శాఖ పంపింది. అందులో 1745 కోట్లు చెల్లించాలని పేర్కొన్నది. 2014-15 నుంచి మొదలుపెడితే 2016-17 సంవత్సరాలకు సంబంధించి 1745 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ రెండు నోటీసు ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3,567 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2014-15 సంవత్సరానికి 663 కోట్లు, 2015-16 సంవత్సరానికి 664 కోట్లు, 2016-17 సంవత్సరానికి 417 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపు ముగిసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు..2017-18 నుంచి 2020-21 సంవత్సరాలకు సంబంధించి అపరాధ రుసుము, వడ్డీలతో కలిపి.1823 కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ అధికారులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఐటీ శాఖ చేపట్టిన పున: పరిశీలనను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆ మరుసటి రోజే ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. కాగా, పున: పరిశీలన చేపట్టేందుకు దానికి తగ్గట్టుగా ఆధారాలు ఆదాయపు పన్ను శాఖ దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తల దూర్చలేమని హైకోర్టు స్పష్టం చేసింది.2014 – 15, 2016 -17 సంవత్సరాలల్లో ఆర్జించిన ఆదాయంపై ఆదాయపు పన్ను శాఖ పున: పరిశీలనను సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 2014 నుంచి 15, 2016 నుంచి 17 పున : పరిశీలనకు సంబంధించి 200 కోట్లు చెల్లించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి 135 కోట్లు రికవరీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాము తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్నామని.. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. దీంతో వెంటనే ఢిల్లీ హైకోర్టు రంగంలోకి దిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ఐటి రూపంలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల సర్వేలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ప్రకటించాయి. ఈసారి 400కు మించి సీట్లు గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కూటమితో సంబంధం లేకుండానే సొంతంగా అధికారంలోకి రావాలని తలపోస్తోంది. భారతీయ జనతా పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీని ఊపిరాడకుండా చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న నిధులను రికవరీ చేసింది. దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది

Related Posts