YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీపై కేసీఆర్ వ్యూహామా... మౌనమా...

బీజేపీపై కేసీఆర్ వ్యూహామా... మౌనమా...

హైదరాబాద్, ఏప్రిల్ 2,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తర్వాత కేసీఆర్ పెద్దగా బయట కనిపించలేదు. ఓడిపోయిన తర్వాత సంఘిభావంగా పలువురు నేతలు, కార్యకర్తలు ఫామ్‌హౌస్‌కు వస్తున్న సందర్భంలో ఆయన బాత్ రూంలో జారి పడటంతో  విశ్రాంతికి పరిమితమయ్యారు. తర్వాత నల్లగొండలో బహిరంగసభ.. మళ్లీ నల్లగొండ జిల్లాలోనే రైతుల పరామర్శ యాత్ర చేసారు. రెండు సందర్భాలు పరోక్షంగా అయినా ఎన్నికల కోణంలో నిర్వహించిన పర్యటనలే. అయితే రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. విమర్శించలేదు. ఈ రెండు సందర్భాల్లోనే కాదు.. కీలకమైన పరిణామాలు జరిగినప్పుడు కూడా.. అంటే కుమార్తెను అరెస్టు చేసిన అంశంపైనా ఆయన స్పందించలేదు. కేసీఆర్ వ్యవసాయం, రైతుల సమస్యలు అజెండాగా మార్చుకుని లోక్ సభ ఎన్నికల కోసం బయటకు వచ్చారు.  గతంలో ఎన్నడూ లేనంత క్లిష్టమైన రాజకీయ సవాళ్లను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. కానీ ఆయనకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. వాటి మధ్యే ఆయన రాజకీయం చేస్తున్నారు. కవితను బీజేపీలోకి రావాలని  బెదిరించారని లేకపోతే కేసులు, అరెస్టులు తప్పవని బీజేపీ బెదిరించిందని 2022 నవంబర్‌లో పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.   కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ బహిరంగంగా స్పందించింది చాలా తక్కువ. అయితే అప్పట్లో కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఈడీ దాడులు చేసిన తర్వాత కవితను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు.  బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని.. అప్పట్లో స్పష్టం చేశారు.  కవితపైనే కాదు పార్టీ నేతలపైనా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడతాయని అయినా ఆందోళన చెందవద్దని చెప్పారు.  దాదాపుగా ఏడాదిన్నర తర్వాత చూస్తే కేసీఆర్ బీజేపీతో యుద్ధం కాదు కదా  కవితను అరెస్టు చేసినా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. బీజేపీని ఒక్క మాట అనడం లేదు. కవితను అరెస్టు చేసిన రోజున కేటీఆర్ బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కానీ కేసీఆర్ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ఉండాలా.. ఇండియా కూటమి ఉండాలా అన్న అంశం ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుంది. అంటే కేంద్రం అంశాలు హైలెట్ అవ్వాలి. అయితే కేసీఆర్ పూర్తిగా రాష్ట్రంలో ఉన్న కరువుకు కాంగ్రెస్‌ను బాధ్యురాల్ని చేసి బీఆర్ఎస్ కు ఓట్లేయించుకోవాలన్న వ్యూహం పాటిస్తున్నారు.  పూర్తిగా బీజేపీ విషయంలో ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సీఏఏను అమల్లోకి తెచ్చినా బీఆర్ఎస్ స్పందించలేదు. నిజానికి సీఏఏ అంశం బీఆర్ఎస్‌కు కీలకం. ముస్లిం వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఈ అంశంపై బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ వదలుకున్నారు. బీజేపీ జోలికి వెళ్లాలని అనుకోవడం లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ తీరు పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే బీజేపీని  విమర్శించడాన్ని ఆయన ఎన్నికల కంటే ముందే ఆపేశారు. రాబోయే ప్రమాదాన్ని ఆయన ముందుగానే ఊహించారు. కానీ ప్రమాదం మాత్రం ఆగలేదని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. నిజానికి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో..  బీఆర్ఎస్‌కు ముప్పుగా మారింది. ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీకి బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు.. ఎక్కువ ఓట్లు వస్తే ఆ తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేయడం కేసీఆర్ వల్ల కూడా కాదు. ఎందుకంటే బీజేపీ రాజకీయం అంతే వయోలెంట్ గా ఉంటుంది.  అయితే.. బీజేపీతో ఏం చేస్తే చేసుకోని అన్నట్లుగా బీఆర్ఎస్ మారింది.  అది ఆ పార్టీ నిస్సహాయతలా మారింది.  తమ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లినా.. అసలు ముప్పు బీజేపీ నుంచే పొంచి ఉంది. నిజానికి కాంగ్రెస్,  బీజేపీ కలిసే  బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తున్నాయన్న అనుమానం బీఆర్ఎస్ లో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీని  కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే ప్లాన్ రెండు పార్టీలు కలిసి అమలు చేస్తున్నాయన్న ప్రచారం మీడియాలో జరిగింది. రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ను మోదీ కాల్చబోతున్నారని చెబుతున్నారు. మొదట్లో బీఆర్ఎస్ నేతల్ని  చేర్చుకునే విషయంలో ఎలాంటి ఆసక్తి చూపని రేవంత్ రెడ్డి.. తర్వాత ప్రభుుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు  చేస్తూ.. తన పార్టీ గేట్లెత్తారు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బలహీనపడటం ప్రారంభమయింది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాతే చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతల్ని ముందుగానే చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని బలహీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈ విషయం బీఆర్ఎస్‌కు అవగాహన లేకుండా ఉండదని అనుకోలేం. కానీ ఆ పార్టీ ఎలా స్పందించాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీని ఎదిరిస్తే  ఇప్పుడు మరిన్ని కష్టాలు వస్తాయని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందుకే ఆ పార్టీపై వీలైనంత  మౌనం పాటిస్తోంది. ఇదే అలుసుగా బీజేపీ..  బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ సాయంతో ఆక్రమిస్తున్నట్లుగా రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు  బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న  సవాల్ కంటే.. అత్యంత ప్రమాదకరమైన సవాళ్లు పార్లమెంట్ ెన్నికల తర్వాతే వస్తాయి.  పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. అదే సమయంలో ట్యాపింగ్ అంశం ఎంత స్థాయికి వెళ్తుందో చెప్పడం కష్టం.  అవినీతి కేసుల కన్నా ఇదే పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. కానీ ఎన్నికల్లో ప్రజాబలం ఉందని నిరూపించుకోగలిగితే..  బీజేపీ స్నేహానికి ప్రయత్నిస్తుందని.. అదే కాపాడుతుందని ఆశతో బీఆర్ఎస్ ఉన్నట్లు భావించవచ్చు.

Related Posts