YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరువు కోరల్లో కరీంనగరం..

కరువు కోరల్లో కరీంనగరం..

కరీంనగర్, ఏప్రిల్ 2
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి.‌ సాగునీటి కాలువలు వట్టిపోయాయి. పంటపొలాలు నెర్రలు బారాయి. పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటపొలాలను చూసి దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కొందరు బావుల్లో పూడిక తీస్తుండగా మరికొందరు ట్యాంకర్ ల ద్వారా పంటపొలాలకు నీటి సప్లై చేస్తున్నారు.‌ నీటి వసతి లేని రైతులు ఎండిన పంటలను పశువులకు మేతగా మార్చుకుంటున్నారు. మరికొందరు కడుపు మండి నిప్పంటించి తగులబెడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే వెలాది ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. సిరిసిల్ల, మానకొండూర్, కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాలో పంటనష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండిపోయిన పంటలకు ఎకరాన 30 వేల రూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.‌ లేకుంటే పెట్టిన పెట్టుబడి రాక అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన రైతులను నీటి కష్టాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చేతికందే దశలో ఉన్న వరిపంటకు చివరి తడికి నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడడంతో కరీంనగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చెందిన రైతు పూరెల్ల అంజయ్య ట్యాంకర్ ద్వారా వరిపంటకు సాగునీరు అందిస్తున్నారు. వ్యవసాయ బావితోపాటు కెనాల్ నీటి వసతి ఆధారంగా తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంన్నరలో వరిపంట సాగు చేశాడు. కాలువ నీళ్ళురాకపోవడంతో బావి నీళ్ళతో ఇంతకాలం పొలం పారింది. గత పదిరోజుల్లో భూగర్భ జలాలు పది నుంచి 15 మీటర్ల లోతుకు పడిపోవడంతో బావిలో నీళ్ళు పొలానికి సరిపోకపోవడంతో ట్యాంకర్ ద్వారా మొక్కకో చుక్క నీరు అన్నట్లు వాటర్ సప్లై చేసి ఎండుతున్న పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో 15 రోజులైతే పంట చేతికందే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు ఒక్కో ట్యాంకర్ కు వెయ్యి రూపాయల చొప్పున రోజుకు నాలుగు టాంకర్ ల వరకు తెప్పించి బావిలో పోయించి పంపుసెట్ ద్వారా పంటకు అందిస్తు ఆవేదనతో ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం ఎండుతున్న పంటకు జీ గంజిలా చివరి తడికోసం కాలువ నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని అంజయ్య కోరుతున్నాడు.రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు పంటల పొలాలు ఎండిపోవడంతో బిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి లో ఎండిన పంటలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. సాగునీరు లేక పంటలు ఎండి పుట్టెడు దుఃఖంతో ఉన్న రైతులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. రైతులను చూస్తే బాధేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్లను భూతద్దంలో చూపెడుతు రైతులకు సాగునీరు ఇవ్వడం లేదన్నారు. కుంగిపోయిన పిల్లర్ల వద్ద కాఫర్ డామ్ కట్టి నీటిని ఎత్తిపోస్తే రైతులకు సాగునీరు అంది పంటలు ఎండేవికాదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టకుండా డిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లు నాలుగు నెలలో 15 సార్లు జాత్రలు, యాత్రలు చేస్తున్నారే తప్పా, చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసిఆర్ పై కడుపుమంటతో మేడిగడ్డ ను రిపేర్ చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుందని ద్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆవేదనతో ఆందోళన చెంది ఆత్మహత్య లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దని.. మీకోసం కెసిఆర్ త్వరలో వస్తారని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండండి, మేం ఉన్నాం అంటూ దైర్యం చెప్పారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సాగునీరు లేక ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా ఎకరాన పదివేలు లేదా 20 వేల చొప్పున తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరాల 15000, కౌలు రైతులకు 12000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి, బోనస్ క్వింటాల్ కు 500 చెల్లించాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకపోగా బ్యాంకు ల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ రైతుల మెడపై కత్తి పెట్టి కడతారా చస్తారా అన్నట్లు వేధిస్తుందన్నారు. కెసిఆర్ దిగిపోయే ముందు 7000 కోట్ల రూపాయలు రైతుల కోసం యాసంగి పంట కోసం రైతుబంధును పెడితే ఇప్పటివరకు రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానా నింపడానికి చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతుబంధు, రుణమాఫీ సాధించుకుందాం, మేడిగడ్డ రిపేరు చేయించే వరకు వదిలిపెట్టమన్నారు.

Related Posts