చిత్రం: అభిమన్యుడు
నటీనటులు: విశాల్, సమంత, అర్జున్, దిల్లీ గణేశ్, శ్రీజ రవి, రోబో శంకర్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: జార్స్ సి.విలియమ్స్
ఎడిటింగ్: రుబెన్
నిర్మాత: విశాల్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్
బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 01-06-2018
ఇటీవల యువ కథానాయకులు ఎంచుకునే కథల నేపథ్యం పూర్తిగా కొత్త పంథాలో సాగుతోంది. ఆరు పాటలు, ఆరు ఫైట్‌లు అంటూ కొలమానం పెట్టుకుని సినిమా తీసే రోజులు ఎప్పుడో పోయాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే సామాజిక సమస్యల ఇతివృత్తంగా వచ్చే కథలకు మరో ఆలోచన లేకుండా పచ్చజెండా ఊపుతున్నారు. తమిళంలో ఇతర కథానాయకులతో పోలిస్తే విశాల్ శైలి కాస్త భిన్నం. ఇటవలే ‘డిటెక్టివ్’ అంటూ ఓ కొత్త తరహా కథతో ఆకట్టుకున్న ఆయన తాజాగా లక్షల మంది ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సైబర్ మోసాల నేపథ్యంలో తీసిన చిత్రం ‘అభిమన్యుడు’. ‘ఇరుంబు తిరై’గా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభిమన్యుడు’ ఎలా ఉన్నాడు? సైబర్‌మోసాలను ఎలా ఎదుర్కొన్నాడు? విశాల్ ఖాతాలో మరో విజయం పడిందా?
కథేంటంటే: విశాల్(కరుణాకర్) మిలటరీ ఆఫీసర్. కోపం ఎక్కువ. తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే సహించలేడు. ఆ కోపం కారణంగానే సస్పెండ్‌కు గురవుతాడు. కోపాన్ని తగ్గించుకోవడానికి యాంగర్ మేనేజ్‌మెంట్ క్లాస్‌లు తీసుకుంటాడు. ఇందుకోసం లతాదేవి(సమంత) అనే డాక్టర్‌ను కలుస్తాడు. కరుణ కోపానికి కారణం అతని గతమేనని తెలుసుకుంటుంది లత. అందుకే ఎప్పుడో వదిలేసిన ఇంటికి మళ్లీ వెళ్లమని సలహా ఇస్తుంది. దాంతో కరుణ తన ఊరికి వెళ్తాడు. చెల్లెలు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేయడానికి పూనుకుంటాడు. అందుకోసం రూ.10లక్షలు అవసరం అవుతాయి. ఊరిలో ఉన్న ఆస్తిని రూ.4లక్షలకు అమ్మి, మరో ఆరు లక్షలు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. బ్యాంకులో పడిన రూ.10లక్షలు సడెన్‌గా మాయం అవుతాయి. ఆ పదిలక్షలు మాయం చేసింది వైట్ డెవిల్(అర్జున్). కరుణ పదిలక్షలు మాత్రమే కాదు. ఇలా కొన్ని వందల, వేల మంది బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేసి ఆ సొమ్మును తన ఖాతాలోకి మార్చుకుంటాడు వైట్ డెవిల్. ఇంతకీ వైట్ డెవిల్ ఎవరు? అతని సామ్రాజ్యాన్ని కరుణ ఎలా నేల మట్టం చేశాడు? అన్నదే కథ
సాంకేతికంగా.. దర్శకుడి ఆలోచన బాగుంది. సైబర్‌క్రైమ్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ద్వితీయార్ధంలో అల్లుకున్న స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. యువన్ సంగీతం ప్రధాన ఆకర్షణ. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయగలిగాడు. జార్జ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. రుబెన్ ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి. విజయ్‌మాల్యాకు సంబంధించిన డైలాగ్‌లు ఏటీఎం మిషన్‌కు, ఓటింగ్ యంత్రానికి పోలిక చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి.
బలాలు
+ కథా నేపథ్యం
+ విశాల్-అర్జున్‌ల మధ్య సాగే సన్నివేశాలు
+ ద్వితీయార్ధం
బలహీనతలు
- అక్కడక్కడా కాస్త నెమ్మదించిన కథనం
రేటింగ్: 2.75/5