రాజమండ్రి, ఏప్రల్ 4,
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటయింది కానీ.. నేతల్లో మాత్రం సఖ్యత కనిపించడం లేదు. బయటకు మాత్రం తాము మద్దతిస్తున్నట్లు చెబుతున్నారే తప్ప ఒకరినొకరు సహకరించుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఒకసారి చేజారిన నియోజకవర్గం మళ్లీ మన చేతికి వస్తుందో? రాదో అన్న ఆందోళన నేతల్లో ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలూ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ పది శాసనసభ స్థానాల్లో, జనసేన 21, టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే బీజేపీ, జనసేనకు కేటాయించిన స్థానాల్లో మాత్రం టీడీపీ నేతలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పొత్తులో భాగంగా కోల్పోయిన నియోజకవర్గాలు ఇప్పటికీ మన చేతుల్లోకి రావన్న భావన టీడీపీ నేతల్లో బలంగా ఉంది. ఒకసారి ఈ నియోజకవర్గంలో జనసేన కానీ, బీజేపీ కానీ గెలిస్తే తర్వాత ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గాలనే కోరతాయని, ఎప్పటికీ తాము పోటీ చేసేందుకు అవకాశం రాకపోవచ్చన్న ఆందోళన వారిలో నెలకొని ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు పరోక్షంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. తాము ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ తమ క్యాడర్ కు మాత్రం సంకేతాలను పంపుతూ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. అనపర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే దానిని బీజేపీకి అప్పగించారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా బీజేపీ పరమయింది. ఎచ్చెర్లలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ టీడీపీ, జనసేన క్యాడర్ బీజేపీ అభ్యర్థులకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఒకసారి వాళ్లు గెలిస్తే ఇక్కడ పాతుకుపోయి తమ రాజకీయ భవిష్యత్ గల్లంతవుతుందన్న ఆందోళన నేతల్లో నెలకొంది. అయితే ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో నేతలు ప్రయత్నిస్తున్నప్పటికీ సమావేశానికి కొందరు హాజరవుతున్నా మనస్ఫూర్తిగా మాత్రం వారికి సహకరించే అవకాశం మాత్రం లేదంటున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది. . అలాగే జనసేన పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. జనసేన జెండా ఒకసారి ఇక్కడ ఎగిరితే ఇక తమను పట్టించుకోరని కూడా నేతలు భయపడిపోతున్నారు. అనేక చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందన్న సమాచారంతో అభ్యర్థులు తమ అగ్రనేతలకు మొరపెట్టుకుంటున్నారట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసే పిఠాపురంలోనే ఈ పరిస్థితి ఉందంటున్నారు. తిరుపతి, రైల్వేకోడూరు లాంటి చోట కూడా టీడీపీ క్యాడర్ మొహం తిప్పుకుంటుంది. ఇలా దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అగ్రనేతలు బుజ్జగించినప్పుడు ఓకే అని చెప్పి వచ్చి తమ పని తాము చేసుకు పోతున్నారట. మరి ఫలితాల తర్వాత కట్టప్పలు ఎవరన్నది బయపడుతుంది.