మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార, విపక్షలు ప్రజల వద్దకు వచ్చి వివిధ రూపాల్లో తమ తమ హామీలను వెల్లడిస్తున్నాయి. సగటు ప్రజలను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. దూషించుకుంటున్నారు. ప్రజలు తమ పార్టీనే నమ్మాలని సీఎం చంద్రబాబు అండ్ టీడీపీ నాయకులు జనాల చెవుల్లో మైకులు పెట్టుకుని మరీ నూరి పోస్తున్నారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ కూడా ప్రజల్లో తిరుగుతూ.., తమకే రాజ్యాధికారం ఇవ్వాలని కోరుతున్నారు. తమ ప్రభుత్వం వస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీల మీద హామీలు ఇస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు అధికారం అక్కర్లేదని చెప్పిన పవన్.. ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే.. తాను సీఎం అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రజల్లో తిరిగి ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తన్నాడు. అంతా బాగనే ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్లో తిరుగుతుండడం, హామీలు గుప్పిస్తుండడం అన్నీ బాగానే ఉన్నాయి! సీన్ కట్ చేస్తే.. ఇవే హామీలు 2014లోనూ అధికార పార్టీగా అవతరించిన టీడీపీ ఇచ్చింది. మరి ఇప్పటికీ ప్రజల్లో అసంతృప్తి అలానే ఉండిపోయింది. పేదలు పేదలుగానే ఉండిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి స్థాయిపై సర్వే చేయిస్తున్నట్టుగానే అభివృద్ధి స్థాయిపై కూడా సర్వే చేయిస్తే.. బాగుంటుందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాలు మారినా.. తమ తలరాతలు మారడం లేదని ఎందుకు కుమిలిపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాల నుంచి ప్రజలు కోరుతున్నది ఏమిటి? వంటి కీలక అంశాలను పరిశీలిస్తే.. నిజాయితీతో కూడిన పాలనను ప్రజలు ప్రభుత్వాల నుంచి కోరుకుంటున్నారు. నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లగలిగే పరిస్థితిని, అవినీతిలేని అధికార యంత్రాంగాన్ని, ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ఒకింత నిజాయితీతో కూడిన ఆసరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ సమానంగా అవకాశం లేకపోయినా.. ఉన్న అవకాశాలనే నిజాయితీగా కల్పించాలని కోరుతున్నారు.పింఛన్లను కానీ, రేషన్‌ను కానీ, అవసరం ఉన్నవారికే ఇచ్చినా సంతోషమేనని ప్రజలు చెబుతున్నారు. ప్రధానంగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు భద్రత కల్పించాలని కోరుతున్నారు. అంతే తప్ప తమను సోమరి పోతులను చేయమని, ఊరికేనే తమకు డబ్బులు పందేరం చేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయమని ప్రజలు ఎట్టి పరిస్థితిలోనూ కోరుకోవడం లేదు. మరి ఈ విషయాలను ప్రధాన పార్టీలు గుర్తిస్తాయా? లేదా చూడాలి.