YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభ సభ్యుల ప్రమాణం...

రాజ్యసభ సభ్యుల ప్రమాణం...

న్యూఢిల్లీ,  ఏప్రిల్ 4
ఇన్నాళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరవాత ఆమెని రాజ్యసభకు ఎంపిక చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు సోనియా గాంధీ ఇవాళ (ఏప్రిల్ 4) రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ నుంచి ఆమె రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం పూర్తైంది. ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోనియా గాంధీ ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 77 ఏళ్ల వయసులో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమని భావించిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు సోనియా. కాంగ్రెస్‌కి ఈ నియోజకవర్గం కంచుకోటలాంటిది. 2004 నుంచి ఇక్కడే ఆమె పోటీ చేస్తున్నారు. అయితే...ఈ సారి ఇక్కడ ఎవరిని బరిలోకి దింపాలన్న తర్జనభర్జన కొనసాగుతోంది. కాంగ్రెస్‌కి సొంతమైన ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కి వచ్చిన ఒకే ఒక సీటు రాయ్‌బరేలి మాత్రమే. ఇప్పుడు అది కూడా దక్కకుండా పోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోనియా ప్రమాణ స్వీకారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆమె కొత్త ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల గురించి ఆమె విలువైన సలహాలు ఇస్తారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. లోక్‌సభ సభ్యురాలిగా దాదాపు 25 ఏళ్ల పాటు సేవలందించినట్టు గుర్తు చేశారు.
 సోనియా గాంధీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలూ రాజ్యసభ సభ్యులిగా  ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి YSRCP పార్టీకి చెందిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు తెలంగాణలో BRSకి చెందిన వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీఫ్ ధన్‌కర్‌ వీళ్లందరితో ప్రమాణం చేయించారు.

Related Posts