అమెరికా మరో నలుగురు తాలిబన్, ఇద్దరు హక్కానీ నెట్‌వర్క్ నేతలపై ఆంక్షల కొరడా విధించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్థాన్ తమతో కలిసి పనిచేయాలని, తమ భూభాగంలో ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇవ్వరాదని, ముష్కర మూకలకు నిధులు అందకుండా చూడాలని స్పష్టం చేసింది. తాలిబన్ నేతలు అబ్దుల్ సమద్‌సనీ, అబ్దుల్ ఖాదీర్ బషీర్, హఫీజ్ మహ్మద్ పొపుల్ జాయ్, మౌలాబీ ఇనాయితుల్లా, హక్కానీ నెట్‌వర్క్ చెందిన ఫకీర్ మహ్మద్, గులాఖాన్ హమీద్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది. అగ్రరాజ్యం అధికార పరిధిలో ఉండే వీరి ఆస్తులను జప్తు చేయడంతో పాటు అమెరికన్లు ఎవరూ వీరితో లావాదేవీలు నిర్వహించకుండా నిషేదాజ్ఞలు విధించింది. సంకీర్ణ దళాలపై దాడులు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.