తమది భిన్నమైన రాజకీయ పార్టీ అంటూ ప్రజల్లోకి వెళ్లారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజకీయాధికారం కోసం తపించడంలేదని ప్రజా సమస్యల పరిష్కారమే తమ టార్గెట్ అని అంటున్నారు. జనసేనకు అధికారం ఇస్తే.. అద్భుతాలు చేస్తామంటూ ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పొలిటికల్ గా బిజీ అయ్యారు. పోరు యాత్రతో ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను మరోసారి హైలెట్ చేయడంతో పాటూ ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా చేశారు.తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమని పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్ అందరికీ భిన్నంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందరికి భిన్నంగా, కొత్తగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. పవన్ బస్సుయాత్ర, పాదయాత్రలను మిక్స్ చేశారు. వెళ్లిన ప్రతీ ప్రాంతంలోనూ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ తాము ప్రజాసంక్షేమానికే పాటుపడతామని స్పష్టంచేస్తున్నారు. ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ తన యాత్ర తొలినాళ్లలోనే చెప్పారు. దీంతో ఆయన 2019 ఎన్నికలే టార్గెట్ గా ఇప్పట్నుంచే ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం ప్రారంభించేసినట్లు తేలింది. ఇదిలాఉంటే.. తాను పార్టీ పెట్టడానికి, ప్రజల్లోకి రావడానికి గల కారణాలనూ వివరిస్తున్నారు జనసేనాని. సామాజిక, రాజకీయ మార్పు కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, తమ పార్టీతోనే కచ్ఛితమైన మార్పు వస్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో సరికొత్త రాజకీయ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయ వ్యవస్థ కాకుండా సరికొత్త రాజకీయ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుదామని చెప్తున్నారు. స్థానిక, రాష్ట్ర సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ నవ్యాంధ్రను అభివృద్ధి చేయడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అంటున్నారు. విభజన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులు చేశాయని, విభజన హామీలు నెరవేర్చడంలో ప్రధాన మంత్రి మాటమార్చారని పవన్ ధ్వజమెత్తుతున్నారు. నాలుగేళ్లలో ఎన్నో చెప్పిన ప్రధాని ప్యాకేజీ, ప్రత్యేక హోదా అంటూ మోసగించారని విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవాలని తేల్చి చెప్తున్నారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా తాము నిరసన కవాతును కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అవసరమైతే తాను ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమని ఇదివరకే స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.పవన్ కల్యాణ్ తీరు చూస్తే.. వైసీపీ అధినేత జగన్ కు కాస్త భిన్నంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజాసంకల్పయాత్రలో జగన్ రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబులనే టార్గెట్ చేసుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు విఫలమయ్యారని, ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని అంటున్నారు. అయితే కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని పల్లెత్తుమాట అనడంలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. రాష్ట్ర సర్కార్ నే కాక కేంద్రాన్నీ కడిగిపారేస్తున్నారు. ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని అతి మామూలు రాజకీయ నేతగా మిలిగిపోవడం తనకు చేతకాదని స్పష్టంచేస్తున్నారు.జనసేన అందరిలాంటి రాజకీయ పార్టీ కాదని, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టంచేస్తున్నారు. జనసేన ప్రజలందరి పార్టీ అని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబం సంక్షేమం కోసం పాటుపడతామని చెప్తున్నారు. ప్రస్తుతం విజయనగరంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ స్థానిక సమస్యలపై దృష్టి సారించారు. జిల్లాలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేకపోయారని, జిల్లాకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఉద్దానంతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. స్థానికంగా సాగునీటి సమస్యలు పరిష్కరించడం లేదని, గత ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టుల ఊసెత్తలేదని వ్యాఖ్యానించారు. ఉద్దానం, విశాఖ రైల్వేజోన్‌లనూ ప్రస్తావించారు. అన్యాయం జరిగితే తిరుగు బాటు చేసే జిల్లా ప్రజలకు పాలకులు అన్యాయం చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం కళకారులు, రచయితలు, మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని చెప్తున్నారు. సాధారణ రాజకీయ పార్టీలకు జనసేన పూర్తిగా భిన్నమని అంటున్న పవన్ కల్యాణ్.. అదే పంథాలో సాగేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం, ప్రజాసంక్షేమమే ధ్యేయమంటూ ముందడుగేస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలనూ విమర్శిస్తూ.. జనసేనతోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని స్పష్టంచేస్తున్నారు. మొత్తంగా ప్రజలకు టచ్ లో ఉండడంతో పాటూ తమ పార్టీపై ప్రజల్లో సదభిప్రాయం కలిగించేందుకు ట్రై చేస్తున్నారు జనసేనాని