విజయవాడ, ఏప్రిల్ 5
చంద్రబాబు రాజకీయ చాణుక్యుడు. నాలుగున్నర దశాబ్దాల్లో రాజకీయంగా రాటుదేలిన వ్యక్తి. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయనకు తెలుసు. ప్రత్యర్థి ఎంతటి వాడైనా అంచనా వేయగలరు. అందుకు అనుగుణంగా మాట్లాడగలరు. పరిస్థితిని తన చెప్పు చేతల్లోకి తీసుకు రాగలరు. గత ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని విభేదించి దేశవ్యాప్తంగా పర్యటించారు. భార్యనే చూడని వాడు భారతదేశాన్ని ఏం చూస్తాడంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రధాని మోదీని భారతదేశానికి మార్గదర్శిగా అభివర్ణిస్తున్నారు. అంటే ఆయన వైఖరి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించారు. అందుకు ఎన్నో రకాల శక్తులు పనిచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. చంద్రబాబుపై ఉన్న కోపంతో జగన్ కు బిజెపి నుంచి అంతులేని సహాయం లభించింది. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్థి అయిన కేసీఆర్ నుంచి కూడా సపోర్ట్ లభించింది. చంద్రబాబుకు అంతర్గతంగా ఉన్న శత్రువులు సైతం జగన్ తో చేతులు కలిపారు. అందరూ కలిసి కొట్టడంతో చంద్రబాబు ఒంటరి అయ్యారు. ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. తనపై చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు జగన్ పై తిప్పి కొడుతున్నారు. తాజాగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయన చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో పశుపతి అని కామెంట్స్ చేశారు. పసుపు పార్టీ అధినేత కావడంతో ఆ తరహా ఆరోపణలు చేసి ఉంటారని తెలుసు. కానీ అదే పశుపతి వ్యాఖ్యలను చంద్రబాబు తనదైన శైలిలో తిప్పుకొట్టారు. పశుపతి అంటే శివుడని.. ఈ లోకాన్ని కాపాడేందుకు అవతరించాడని.. జగన్ ఈ లోకానికి ఇబ్బంది పెడుతున్నాడని.. తనతో పాటు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడని.. ప్రజల నుంచి జగన్ విముక్తి కలిగించడానికి నేను పశుపతినే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్న జగన్ ప్రత్యర్థులకు ఏరి కోరి అస్త్రాలు అందిస్తుండడం.. అభిమానులకు మింగుడు పడడం లేదు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని వారు సూచిస్తున్నారు