ఎన్డీయే నుంచి మరో కీలక భాగస్వామి దూరమవుతున్నారా…? మోడీ పెత్తనాన్ని ఆ ముఖ్యమంత్రి భరించలేకపోతున్నారా..? మోడీ మాయలో పడి అసలుకే మోసపోయానని భావిస్తున్నారా..? తన రాజకీయ భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? కొద్ది రోజులుగా ఆయన స్వరం మారడంలో ఆంతర్యమేమిటి..? టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఆయన కూడా నడుస్తున్నారా..? అంటే ఇటీవల ఆయన మాట్లాడుతున్న తీరుచూస్తుంటే మాత్రం నిజమేననే సమాధానం వస్తుంది. ఇంతకీ మోడీకి దూరమవుతున్న ఆస్నేహితుడెవరని ఆలోచిస్తున్నారా..? అయితే ఎవరోకాదు.. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్.కొంతకాలం క్రితం బీజేపీ, జేడీయూలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గత ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే ఆర్జేడీ అవినీతిని తట్టుకోలేక నితీష్ కమలం పంచన చేరారు. ఎన్నికల సందర్భంగా మోడీ బీహార్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. వెనకబడిన బీహార్ సమగ్రాభివృద్ధికి లక్షలకోట్లు కేటాయిస్తానని ఆయన చెప్పారు. కానీ, నాలుగేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని విఫలం చెందారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం శివసేన పత్రిక సామ్నాలో ఇదే విషయంపై ఘాటుగా స్పందించింది. బీహారీలకు ఇచ్చిన హామీల్లో మోడీ నెరవేర్చలేదని విమర్శించింది. ఈ క్రమంలోనే మోడీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.మోడీ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న సిటిజెన్ షిప్ బిల్లుపై కూడా మండిపడ్డారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తే వ్యతిరేకంగా ఓటు వేసేందుకు జేడీయూ సిద్ధంగా ఉన్నట్టు మే 17న తనను కలిసిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నేతలకు నితీశ్‌కుమార్ హామీ ఇచ్చారు. అదేవిధంగా మే 26న ఓ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ… మొదట పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. బడాబాబులు ఒక చోటి నుంచి మరో చోటిని డబ్బు రవాణా చేసుకున్నారని, పాత నోట్లను కొత్తగా మార్చుకున్నారనీ, పేదలు మాత్రమే ఇబ్బందులు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మరునాడే.. మే 27న నితీశ్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. తుఫాను బాధితుల సహాయం కోసం కేంద్రం ఇస్తామని చెప్పిన రూ. 1750 కోట్లలో.. ఓ రూ. 500 కోట్లను తగ్గించింది. మోడీ తీరుతో నితీశ్ మరింత అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే మే 29న బీహార్ కి ప్రత్యేక హోదా కావాలంటూ ఆయన మళ్లీ డిమాండ్ చేశారు. గతంలో ఆయన ఈ డిమాండ్ చేసినా.. ఎన్డీయేతో దోస్తీ కుదిరాక ఆ డిమాండ్ మరిచిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. వెనకబడిన రాష్ట్రాలకు హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయే నుంచి శివసేన దాదాపుగా బయటకు వచ్చినట్లే. టీడీపీ ఎన్టీఏ నుంచి తప్పుకుంది. ఈ రెండు పార్టీలూ మోడీ తీరుపై భగ్గుమంటున్నాయి. ఇదేసమయంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.