లక్నో, ఏప్రిల్ 5,
జాతీయ స్థాయిలో చాలామంది నేతలు పార్టీని వీడుతున్న సమయంలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్దమని ప్రకటించారు వాద్రా. అమేధీ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. రాహుల్‌గాంధీని ఓడించినందుకు వాళ్లు చాలా బాధలో ఉన్నారని చెబుతున్నారు. తన భార్య ప్రియాంకాగాంధీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందన్నారు వాద్రా. గాంధీ కుటుంబం అంటే అమేధీ ప్రజలకు చాలా ఇష్టమన్నారు. అమేధీ నుంచి చాలా కాలం పాటు ఎంపీగా ఉన్నారు రాహుల్‌గాంధీ.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కేరళ లోని వయనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు రాహుల్. అయితే రాహుల్ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి రాబర్ట్ వాద్రా పోటీకి సిద్దం కావడం సంచలనం రేపుతోంది. చాలామంది పార్టీ నేతలు తనను ఎన్నికల బరి లోకి దిగాలని కోరుతున్నారని రాబర్ట్ వాద్రా తెలిపారు. బలమైన నేతలు పార్టీని వీడడంతో కాంగ్రెస్ డీలా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ చాలా కీలకం . ఉత్తరప్రదేశ్ 80 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు యూపీ నుంచి ఎన్నికల బరిలో ఉంటే కార్యకర్తల్లో మనోధైర్యం నిండుతుందన్న భావన నెలకొంది.అయితే తన కంటే ముందు ప్రియాంక ఎంపీ అయితే బాగుంటుందని మరో ట్విస్ట్ ఇచ్చారు రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రతిపాదనపై సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందున్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, మిగిలిన 63 స్థానాల్లో ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ప్రాంతీయ పాార్టీలు పోటీ చేయనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులకు సంబంధించి పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.