YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు... ?

తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు... ?

హైదరాబాద్, ఏప్రిల్ 5,
పార్లమెంట్ ఎన్నికలను పరిశీలిస్తే.. సారు, కారు, 16 అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. “ఢిల్లీ వెళ్తారు, గత్తర లేపుతారు, ప్రధానమంత్రి అవుతారు, మోడీని గద్దె దింపుతారు. హస్తినలో చక్రాలు తిప్పుతారు. అప్పట్లో పీవీ నరసింహారావు, ఇప్పట్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు..” అనే వ్యాఖ్యలు తెగ వినిపించేవి. భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా అయితే చేసిన ప్రచారం అతి అనే స్థాయి కూడా దాటిపోయింది. కేవలం ఐదు సంవత్సరాలలో మొత్తం సన్నివేశం మారిపోయింది. 2018 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన భారత రాష్ట్ర సమితి.. 2023 కి వచ్చేసరికి 39 ఎమ్మెల్యేలకు పరిమితమైంది. ఆ ఎమ్మెల్యేలలో ఒకరు మరణించారు. కొందరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఓటమి నేపథ్యంలో ఒకప్పుడు మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ నిర్మానుష్యంగా మారింది. పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వరుస కేసులు, అరెస్టులతో పార్టీ పరువు గంగలో కలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలను నేపథ్యంలో టికెట్ ఇచ్చినా కూడా భారత రాష్ట్ర సమితిలో ఉండే పరిస్థితి లేదు. అందుకు కడియం కావ్య ఉదంతమే తాజా ఉదాహరణ. తెలంగాణలో ఉద్యమ పార్టీగా చెప్పుకున్న భారత రాష్ట్ర సమితికి ఇలాంటి దుస్థితి వస్తుందని కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. పరిస్థితి నానాటికి చేయి దాటుతున్న నేపథ్యంలో కేసీఆర్ గత నెల, ఈ నెలలో ఇప్పటికే మూడుసార్లు ప్రజల్లోకి వచ్చారు. ఎప్పటికప్పుడు నాయకులతో మాట్లాడుతున్నారు. సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సన్నాహక సభల పేరుతో అధికార కాంగ్రెస్ మీద నిప్పులు చెరుగుతున్నారు. కవిత అరెస్టయి తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నప్పటికీ అటు కేటీఆర్, ఇటు కేసీఆర్ ఆ వ్యవహారాలు పర్యవేక్షించుకుంటూనే.. పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.10 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి.. అంతకుముందు ఉద్యమ పార్టీగా మన్ననలు అందుకున్న భారత రాష్ట్ర సమితికి ఇంతటి దుస్థితి రావడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? వీటన్నింటికీ గులాబీ శ్రేణులు నోరు మెదపక పోయినప్పటికీ.. తాజా పరిణామాలను చూస్తే తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు చేయాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల అరెస్టు, ఎమ్మెల్యే, ఎంపీలు వలస వెళ్తుండడంతో.. కేసీఆర్ తెలంగాణ భవన్ వాస్తు పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్లోకి ఎంట్రీ తో పాటు ఎగ్జిట్ మార్గాలలో సమూల మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటివరకు తెలంగాణ భవన్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలకు భారత రాష్ట్ర సమితి నేతలు వాయవ్య గేటును ఉపయోగించేవారు. ఇకపై వాయవ్య గేటు నుంచి కాకుండా ఈశాన్య గేటు నుంచి రాకపోకలు సాగించాలని కేసీఆర్, ఇతర భారత రాష్ట్ర సమితి కీలక నేతలకు వాస్తు పండితులు సూచించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు సాగించేలా కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. వాయవ్య గేటు కూడా మూసి వేసినట్టు తెలుస్తోంది. సో.. మొత్తానికి భారత రాష్ట్ర సమితి ఓటమికి ఆ గేటు సరిగా లేకపోవడమే కారణమా? ఇప్పుడు గేటు సరి చేశారు కాబట్టి ఇకపై భారత రాష్ట్ర సమితికి అంతా లాభమే జరుగుతుందా.. పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకుంటుందా? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Related Posts