ఆంధ్రప్రదేశ్ కు నమ్మకద్రోహం చేశారని బీజేపీ పై మండిపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ఎన్నికల ఫలితాలతో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. నిన్న ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీ కుదేలై పోయింది. మోడీ హవా తగ్గుతుందనడానికి ఇదే ఉదాహరణ అని మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది.చంద్రబాబు బీజేపీతో విరోధం పెట్టుకుని తప్పు చేశామా? అని కొంత లోలోపల మధన పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మోడీ హవా ఉంటే ఏపీలో తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన ఆయనలో ఉండేది. అయితే ఉప ఎన్నికల ఫలితాలతో మోడీ ప్రభంజనం ఏమాత్రం లేదని, బీజేపీతో కటీఫ్ చెప్పి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం, అక్కడ ప్రాంతీయ పార్టీలే హవాను ప్రదర్శించడాన్ని చంద్రబాబు ఉదహరించినట్లు తెలుస్తోంది. మోడీ ప్రతిష్ట నానాటికీ దిగజారుతుందనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మోడీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లోనూ ఇప్పటి ఫలితాలే వస్తాయని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నికలలో మోడీ ఇమేజ్ చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమయింది. అయితే ఈసారి ఎన్నికల్లో మోడీ వ్యతిరేకతే తనను తిరిగి అధికారంలోకి తెస్తుందని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. సిట్టింగ్ స్థానాలను కూడా బీజేపీ కాపాడుకోలేకపోయిందంటే ఎంత వ్యతిరేకత మోడీపై ఉందో ఇట్టే అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో కటీఫ్ చెప్పి తాను మంచి పనే చేశానని, ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని ఆయన మంత్రివర్గ సహచరులకు సూచించారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో చేస్తున్న లాలూచీ రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే విజయం మళ్లీ మనదేనని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొత్తం మీద ఉప ఎన్నికల ఫలితాలతో చంద్రబాబులో మరింత నమ్మకం పెరిగిందంటున్నారు మంత్రివర్గ సభ్యులు.