YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జాతీయ రాజకీయాల్లో కింగ్ కానున్న దేవగౌడ..

జాతీయ రాజకీయాల్లో కింగ్ కానున్న దేవగౌడ..
హెచ్.డి. దేవగౌడ… చాలాకాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. మాజీ ప్రధానిగా నిన్న మొన్నటి దాకా ప్రకటనలు, పర్యటనలు, విలేకరుల సమావేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకే పరిమితమైన ఈ కర్ణాటక రాష్ట్ర నాయకుడు ఇప్పుడు రాష్ట్ర, జాతీయ మీడియాలో తరచూ కనపడుతున్నారు. కింగ్ మేకర్ కావాలని భావించి కింగ్  కుమారుడు కుమారస్వామి మాదిరిగా కాలం కలసి వస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం రాకపోదని ఆశగా ఎదురు చూస్తున్నారు. 1996లో కలలో ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏకంగా ప్రధాని పీఠాన్ని అధిష్టించిన దేవెగౌడ మళ్లీ అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని బలంగా భావిస్తున్నారు. ఆయన ఆశలు, అభిప్రాయాలు, ఆకాంక్షలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. పరిస్థితులు ప్రస్తుతం ఆ దిశగానే ఉన్నట్లు దేవెగౌడ భావిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ పార్టీలన్నీ ఏకంగా కుమారుడి పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఈ విధంగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.కుమారుడు కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో దేవెగౌడ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. అన్నీ తానై వ్యవహరించారు. వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులతో మాటలు కలిపారు. ఆప్యాయంగా మాట్లాడారు. కొందరితో మనసు విప్పి మాట్లాడారు. మళ్లీ తాను జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమన్న సంకేతాలు కొందరికి ప్రత్యక్షంగా, మరికొందరికి పరోక్షంగా తెలియజేశారు. బీజేపీని ఢొకొనేందుకు కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో కమిటీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో కాంగ్రెస్ తో కూటమిగా వెళ్లాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వంటి వారి వాదననూ తోసి పుచ్చలేదు. గతంలో కాంగ్రెస్ తనకు ముందు మద్దతు ప్రకటించి తర్వాత తిరస్కరించిన విషయం గుర్తున్నప్పటికీ ఆ పార్టీతో జట్టు కట్టడానికి అభ్యంతరం లేదని తెలియజేశారు. ప్రాంతీయ పార్టీలసారధులకు జాతీయ స్థాయి అనుభవం లేకపోవడం, ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించలేని పరిస్థితుల్లో తాను విపక్షాల ఏకగ్రీవ అభ్యర్థిగా తెరపైకి రాగలనన్న ఆశ, విశ్వాసం ఈ ఒక్కలిగ వర్గ నాయకుడిలో కనపడుతోంది. ఆరో దశకలంలో రాష్ట్రపతి పదవి అందినట్లే అంది భంగపడ్డ ఉమ్మడి ఏపీ నాయకుడు సంజీవరెడ్డి 1977లో ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయినట్లు తాను కూడా రెండు దశాబ్దాల విరామం అనంతరం మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని భావిస్తున్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న వాదనల నేపథ్యంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఈ కర్ణాటక కురువృద్ధుడు కోరుకుంటున్నారు.మొదటి నుంచీ తాను బీజేపీ వ్యతిరేకినని, ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నట్లు దేవెగౌడ చెబుతున్నారు. గతంలో వాజపేయి వంటి వారు తనకు మద్దతు ఇస్తామన్నప్పటికీ సెక్యులరిజానికి కట్టుబడి తాను తిరస్కరించానన్న విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నారు. 2006లో తన కుమారుడు బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని, కనీసం ప్రమాణస్వీకారానికి కూడా వెళ్లని విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నికలకు ముందు సైతం బీజేపీతో జట్టు కడితే కుమారుడిని కూడా చూడకుండా కుటుంబం నుంచి కుమారస్వామిని వెలివేస్తానని ప్రకటించిన విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నారు. 2006 ఫిబ్రవరి 3న కుమారస్వామి ముఖ్యమంత్రిగా, బీఎస్ యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా ఆ కార్యక్రమానికి తాను గైర్హాజరయ్యానని, తన సెక్యులర్ విలువలకు ఇంతకు మించి నిదర్శనం మరొకటి అక్కర్లేదని గౌడ చెబుతున్నారు. దాదపు ప్రతి ప్రాంతీయ పార్టీ ఏదో ఒక దశలో బీజేపీతో కలిసి ప్రయాణించడమో, లేదా సన్నిహితంగా వ్యవహరించడమో జరిగిందని, తాను మాత్రం ఆ దిశగా ఎప్పుడూ అడుగులు వేయలేదని గౌడ వాదిస్తున్నారు. ప్రధాని పదవి కోల్పోయినా సొంత నియోజకవర్గమైన హసన్ పార్లమెంటు సభ్యుడిగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నానని, జాతీయ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని దేవెగౌడ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీకి దూరంగా, కాంగ్రెస్ తదితర ప్రాంతీయ పార్టీలతో కుమారస్వామి సన్నిహితంగా ఉండటం వల్లే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నానని చెబుతున్నారు.పన్నెండేళ్ల క్రితం బీజేపీతో జట్టుకట్టి కుమారస్వామి ప్రమాణ స్వీకారంచేసినప్పుడు తండ్రిగా తాను వ్యతిరేకించి, టీవీలో ఆ కార్యక్రమాన్నివీక్షించానని, ఇప్పుడు మాత్రం వేదికపై ఆశీనులై మనస్ఫూర్తిగా ఆస్వాదించానని చెబుతున్నారు. పాత మిత్రులైన చంద్రబాబు నాయుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డి,శరద్ పవార్ లతో సన్నిహితంగా వ్యవహరించారు. అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి యువనాయకులు గౌడ ఆశీస్సులు పొందారు. 58 ఏళ్ల కుమారుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా, 85 సంవత్సరాల వయస్సున్న తాను ఢిల్లీ గద్దెను ఏలాలని దేవెగౌడ తపన పడుతున్నారు. ఇది అంత తేలిక కానప్పటికీ, అసాధ్యం కాదన్నది అనుభవం ఉన్న దేవెగౌడ అభిప్రాయం.

Related Posts