YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు లీగల్ నోటీసులు

చంద్రబాబుకు లీగల్ నోటీసులు

విజయవాడ, ఏప్రిల్ 5
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో టీడీపీ కంప్లైంట్‌తో మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు సీఈవో ముకేష్ కుమార్ మీనా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కంప్లైంట్‌ చేసింది. సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు చేసిన ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఈవో నోటీసులు జారీ చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు. జగన్‌ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారం చేసి, ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. మరోవైపు తెలుగుదేశం సీనియర్‌ నేత వర్ల రామయ్య ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా స్పందించారు. మంత్రి జోగి రమేశ్‌, వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జోగి రమేశ్‌ ఆరోపించారని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా ఫిర్యాదు కాపీకి జత చేశారు. వీడియో ఆధారంగా జోగి రమేశ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల సేవల నిలిపివేతకు కారణమయ్యారంటూ చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో చేసిన పోస్టుపై ఏఫ్రిల్ 1వ తేదీన వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. దురుద్దేశంతో చంద్రబాబుపై చేసిన పోస్టు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ధ్రువీకరించిన ఈసీ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నోటీసు అందిన 48 గంటల్లో ఇరువురు నేతలు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులో పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకోకుంటే త్వరలో రాష్ట్రానికి వచ్చే ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

Related Posts