YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హోదా

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హోదా

విజయవాడ, ఏప్రిల్ 6
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏపీలో ఓ అధికారికి ఐఏఎస్‌  హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సిఎంఓలో ముఖ్యకార్యదర్శి హోదాలో ఉన్న ధనుంజయ్ రెడ్డి ఓఎస్డీ గా పనిచేస్తున్న అధికారిణికి ఇటీవల ఏపీ టిడ్కో జనరల్‌ మేనేజర్‌‌  గా పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆరా తీసిన ఉద్యోగులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. 2023 స్టేట్ క్యాడర్ సర్వీస్‌లో భాగంగా సిఎం ముఖ్యకార్యదర్శి వద్ద ఓఎస్‌డిగా పనిచేసే అధికారిణి ఐఏఎస్ హోదా కల్పించే లక్ష్యంతో ఆమెకు అదనపు పోస్టింగ్ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా జీవో విడుదల చేసి ఆ హోదా మాటున కన్ఫర్డ్‌ హోదా కోసం దరఖాస్తు చేసినట్టు ఆరోపిస్తున్నారు. స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న మాధురి గత కొన్నేళ్లుగా సిఎంఓలో ఓఎస్డీ హోదాలో పనిచేస్తున్నారు.2022కోటాలో భాగంగా 2023లో సిఎంఓలో ఓఎస్డీగా పనిచేసిన నీలకంఠారెడ్డికి ఐఏఎస్‌ హోదా లభించింది. 2023కోటాలో జి.మాధురి పేరును రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి సిఫార్సు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల కోడ్ రావడానికి ముందే మార్చి 7నాటికి ఈ జాబితాను యూపీఎస్సీకి పంపినట్టు చెబుతున్నారు.స్టేట్ క్యాడర్ సర్వీస్‌ కన్ఫర్డ్‌ హోదాకు దరఖాస్తు చేయాలంటే దరఖాస్తుదారులు కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. సాధారణంగా స్టేట్ ఆడిట్ విభాగం ప్రాధాన్య ఉద్యోగాల జాబితాలోకి రాదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ హోదా మాత్రమే కన్ఫర్డ్‌ హోదా దరఖాస్తు చేసుకోడానికి అర్హతగా సరిపోవనే ఉద్దేశంతో ఏదొక కీలక పోస్టును కూడా వారికి కేటాయిస్తున్నారు. సిఎంఓలో విధులు నిర్వర్తిస్తూనే అదనపు పోస్టులో కొనసాగినట్టు కాగితాలపై సిఫార్సు చేస్తున్నారు. వాటి ఆధారంగా దరఖాస్తు చేస్తున్నారు.స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్‌లో హోదాలో ఉన్న మాధురిని ఏపీ టిడ్కో జిఎంగా నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 29వ తేదీన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదేళ్లుగా ఏపీ టిడ్కో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టకపోయినా టిడ్కోలో మాధురికి పోస్టింగ్ ఇవ్వడం కేవలం కన్ఫర్డ్‌ హోదా కోసమేనని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.పట్టణ గృహనిర్మాణం గురించి తెలుసుకునేందుకు జిఎం గా పనిచేసే అవకాశం కల్పించాలని ఫిబ్రవరి 26న ఆమె విజ్ఞప్తి చేయగానే అదే రోజు టిడ్కో ఎండీ అంగీకారం తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. మూడ్రోజుల్లోనే జీవో జారీ అయ్యింది. సిఎం ముఖ్య కార్యదర్శి వద్ద ఓఎస్డీ హోదాలో పనిచేసే అధికారిణికి టిడ్కో జిఎంగా అదనపు పోస్టింగ్‌ ఇవ్వడంపై ఉద్యోగులు ఆరా తీయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు ఐఏఎస్‌ హోదా కట్టబెట్టే ప్రయత్నాల్లో భాగంగానే జీవోలో జారీ చేయడం, యూపీఎస్సీకి సిఫార్సు చేయడం ఆగమేఘాలపై నడిచినట్టు తెలుస్తోంది.కన్ఫర్డ్‌ జాబితాలో గత ఏడాది ఐఏఎస్‌ హోదా పొందిన నీలకంఠారెడ్డి, పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్ అనిల్‌ రెడ్డిలకు అవకాశం కల్పించారు. తాజాగా జి.మాధురి రెడ్డిని కూడా ఐఏఎస్‌గా చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వంలో రెవిన్యూయేతర విభాగాల్లో అన్ని విభాగాలకు సమాన అవకాశాలు కల్పించాల్సి ఉండగా స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరికి ఐఏఎస్ హోదా కల్పించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిఎంఓకు రాకముందు ఓఎస్డీ మాధురి విశాఖలో విధులు నిర్వర్తించారు. విశాఖపట్నానికి చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సుతో సిఎంఓలో ప్రవేశించినట్టు చెబుతారు.గత ఏడాది సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఓఎస్టీలుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న ధనుంజయ్‌ రెడ్డి ఓఎస్డీ నీలకంఠరెడ్డితో పాటు పులివెందుల ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ రెడ్డిలను ఎంపిక చేశారు.హోదా కోసం అర్హత కలిగిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 40మంది అధికారులు కొద్ది నెలల క్రితం జిఏడికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ రకాల వడపోతల తర్వాత ఎంపిక ఉండటంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకున్నారు. అన్ని దశలు దాటుకున్న తర్వాత ముఖ్యమైన వ్యక్తుల ఆశీస్సులు ఉన్న వారికే హోదా లభించినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు పోస్టుల్లో ఒకే వర్గానికి ప్రాధాన్యత కల్పించడంపై ఇతర దరఖాస్తుదారులు నిరుత్సాహానికి గురయ్యారు.ఇప్పుడు అదే వర్గానికి అవకాశం దక్కుతుందనే అక్రోశం వ్యక్తం చేస్తున్నారు.జిఏడి సర్వీసెస్‌ షార్ట్‌ లిస్ట్ చేసిన జాబితాను ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం డిఓపిటికి సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిఎస్‌ ఎంపిక చేసిన జాబితాను సిఎంఓకు సిఫార్సు చేశారు. తుది జాబితాలో పేర్లు దక్కించుకున్న వారికి కన్ఫర్డ్‌ హోదాను కట్టబెట్టేందుకే టిడ్కో జిఎం పోస్టింగ్ ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు. కన్ఫర్డ్‌ హోదా కోసం దరఖాస్తు చేసుకునే నాన్ రెవిన్యూ అధికారులకు కనీసం మూడేళ్ల సర్వీసుతో పాటు కనీసం ఏడు క్రెడెన్షియల్స్‌ ఉండాలని చెబుతున్నారు. సర్వీస్ రికార్డు, పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కింద ఐఏఎస్లుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు 85 శాతం రెవెన్యూశాఖ వారిని, మిగిలిన 15 శాతం ఇతర శాఖల వారిని ఎంపిక చేస్తారు. కన్ఫర్డ్‌ సర్వీసెస్‌కు ఎంపిక చేసినపుడు రెవెన్యూ నుంచి వచ్చే వారికి మౌలిక పరీక్ష ఉండదు. ఇతర శాఖల వారికి మాత్రం పరీక్ష నిర్వహిస్తారు.సిఎంఓలో పనిచేసిన ఒకే ఒక్క కారణంతో ఎంపికలు జరిగాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు

Related Posts