YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇచ్చాపురం...వార్ వన్ సైడేనా

ఇచ్చాపురం...వార్ వన్ సైడేనా

శ్రీకాకుళం, ఏప్రిల్ 6
రాష్ట్రంలో శివారు నియోజకవర్గం ఇచ్ఛాపురం. పక్క రాష్ట్రం ఒడిశాకు అనుకుని ఉండే ఈ నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సీఎం జగన్‌.. ఆయన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరర్‌రెడ్డిని విజయతీరాలకు చేర్చిన పాదయాత్రల విజయోత్సవానికి వేదికైంది ఇచ్ఛాపురమే. అందుకే ఇచ్ఛాపురం అంటే వైఎస్‌ ఫ్యామిలీకి ఎంతో సెంటిమెంట్‌. ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో ఉన్న నియోజకవర్గం. మన రాష్ట్రాన్ని ఉత్తర భారతదేశంతో అనుసంధానం చేసే చక్కని ప్రదేశం. ఒకవైపు సముద్ర తీరం.. మరోవైపు జాతీయ రహదారి.. మధ్యలోని అందమైన ఉద్దానం ప్రాంతం. పచ్చని కొబ్బరి తోటలతో చాలా అహ్లాదం ఉంటుంది ఇచ్ఛాపురం నియోజకవర్గంలో…. ప్రశాంతమైన… నిష్కంళక వాతావరణం ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబానికి సెంటిమెంట్‌ పరంగా ఇచ్ఛాపురం ఎంతో ముఖ్యం. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి… ప్రస్తుత సీఎం జగన్‌ చేసిన పాదయాత్రలు.. వీరిద్దరికి మధ్యలో వైసీపీ విజయానికి వైఎస్‌ షర్మిల చేసిన పాదయాత్ర విజయోత్సవ వేడుకలు ఇచ్ఛాపురంలోనే నిర్వహించారు.ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. నేటి సీఎం జగన్‌…. ఆ కుటుంబానికి అంతటి ప్రాధాన్యం ఉన్న ఇచ్ఛాపురంలో ఒక్కసారి కూడా వైసీపీ గెలవలేదు. అంతేకాదు.. గత నాలుగు దశాబ్దాల్లో 9సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే టీడీపీ ఓడిపోయింది. అదీ 2004లో వైఎస్‌ పాదయాత్ర ఎఫెక్ట్‌ బాగా పనిచేయడంతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1983 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి తప్ప మిగిలిన 8 సార్లు టీడీపీ అభ్యర్థులే ఇచ్ఛాపురంలో గెలుస్తూ వస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎంతటి పట్టుందో చెప్పొచ్చు.ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలు.. 2 లక్షల 67 వేల 108 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్ష 30 వేల 130 మంది పురుష ఓటర్లు ఉండగా, లక్ష 36 వేల 961 మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్.. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ పై 7వేల 145 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వస్తున్న అశోక్‌ వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈసారి హాట్రిక్‌ కొట్టడం ఖాయమనే ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే అశోక్‌. ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని.. ఇచ్ఛాపురంలో తాను.. రాష్ట్రంలో టీడీపీ గెలవడం ఖాయమంటున్నారు అశోక్‌.ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఆరు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. జనాభా పరంగా రెడ్డిక, యాదవ, మత్సకార సామాజిక వర్గాలు తొలి మూడు స్థానాల్లో ఉండగా, కళింగ, బెంతు ఒరియాలు, శ్రీశయన సామాజిక వర్గాలు ఓట్లు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. అయితే ఏ ఒక్క కులానికి పూర్తిస్థాయిలో మెజార్టీ లేకపోవడం.. అన్ని కులాలు బీసీ వర్గానికే చెందడంతో తొలి నుంచి టీడీపీ హవా చూపుతోంది. టీడీపీ ఆధిపత్యానికి చెక్‌ చెప్పేందుకు అప్పట్లో కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీ యాదవ, కళింగ సామాజికవర్గాలకు అవకాశాలు ఇచ్చినా, మిగతా కులాల మద్దతుతో కంచుకోటను కాపాడుకుంటూ వస్తోంది టీడీపీ.ఐతే ఈసారి ఎలాగైనా టీడీపీ కోటను బద్ధలుకొట్టాలనే ఉద్దేశంతో తొలిసారిగా మహిళను బరిలోకి దింపింది అధికార పార్టీ. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌కు బదులుగా ఈసారి ఆయన సతీమణి విజయకు అవకాశం ఇచ్చింది. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానని.. ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని సీఎం జగన్‌కు గిప్ట్‌గా ఇస్తానని చెబుతున్నారు వైసీపీ అభ్యర్థిని పిరియా విజయ.ఇచ్ఛాపురం చరిత్రలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న రెండో మహిళా అభ్యర్థి పిరియా విజయ. 2004లో టీడీపీ తరఫున దక్కత ఏకాంబరి పోటీచేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేశ్‌కుమార్‌ అగర్వాల్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఐతే ఈ ఎన్నికల్లో గెలిచి ఇచ్ఛాపురం తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తానంటున్నారు పిరియా విజయ. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న పిరియా విజయ.. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. 2009లో విజయ భర్త సాయిరాజ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన పిరియా కుటుంబానికి వైసీపీలో ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎలాగైనా ఇచ్ఛాపురంలో వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ఇతర నేతలకు పదవులు కట్టబెట్టింది పార్టీ. దీంతో ఈసారి ఎలాగైనా గెలుస్తామనే నమ్మకం ప్రదర్శిస్తున్నారు పిరియా విజయ.మొత్తానికి రెండు పార్టీలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ.. ఈసారి టీడీపీ రికార్డును బ్రేక్‌ చేయాలని వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. అధికార పార్టీలో కొంతవరకు గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారాయనే ప్రచారం ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ ఏకపక్ష విధానాలపై క్యాడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్న వారు సైతం ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు. కంచలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచ్‌లు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. వీరందరినీ కలుపుకుని వెళితే వైసీపీకి చాన్స్‌ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.ఇదే సమయంలో టీడీపీ సంఘటితంగా పోరాడుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అశోక్‌ హ్యాట్రిక్‌ ఖాయమంటోంది. ఈ పరిస్థితుల్లో మహిళా అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన పిరియా విజయ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రభుత్వ పథకాలు, గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈసారి టీడీపీ కోటను బద్ధలుకొడతానంటోంది. నిజంగా వైసీపీ ఆశలు నెరవేరతాయా? టీడీపీకే జనం జైకొడతారా? అన్నది చూడాల్సి వుంది.

Related Posts