YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీట్ల మార్పులో వ్యూహాత్మక అడుగులు

సీట్ల మార్పులో వ్యూహాత్మక అడుగులు

ఏలూరు, ఏప్రిల్ 6
ఎన్డీయే కూటమి పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల మార్పుల్లో జనసేన-టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చే నేతలకు టికెట్లిస్తూ పవన్‌ డిఫరెంట్‌ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవనిగడ్డ టికెట్ ఆశించిన మండలి బుద్ధప్రసాద్‌.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో కండువా మార్చేశారు. జనసేనలోకి జంప్‌ అయ్యారు. నేరుగా పవన్‌ కళ్యాణ్‌ను కలిసి కండువా కప్పుకున్నారాయన. ఎట్టకేలకు టికెట్‌ దక్కించుకున్నారు. జనసేన నుంచి అవనిగడ్డ తరపున పోటీకి సిద్దమయ్యారు. మండలి బుద్ధ ప్రసాద్‌ పోటీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు పవన్‌. బుద్దా పార్టీలో చేరినప్పటి నుంచి అవనిగడ్డ జనసేన భగ్గుమంటోంది. జనసేన ఓటమికి పనిచేసినవారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ స్థానిక నేతల ఆందోళనలకు దిగారు. గతకొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనగళం వినిపిస్తున్నారు. బుద్ధాకి అవనిగడ్డ సీటు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ జనసేన అధిష్టానాన్ని హెచ్చరించారు పార్టీ శ్రేణులు. అయినప్పటికీ మండలి బుద్ధ ప్రసాద్‌ వైపే మొగ్గుచూపారు పవన్‌. ఆయన గెలుపుకోసం అవనిగడ్డ జనసేన నేతలు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు.భీమవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనసేన అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు పవన్‌. భీమవరం నుంచి తొలుత పవన్‌కల్యాణ్‌ పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సమీకరణాల్లో భాగంగా రామాంజనేయులును బరిలోకి దించాలని నిర్ణయించారు. రామాంజనేయులు 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున భీమవరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన ఆయన ముక్కోణ పోటీలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా భీమవరం నుంచి పవన్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ ఇటీవలే పిఠాపురంలో పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకొండ అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినా ఇంత వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. పార్టీ కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని జయకృష్ణకు సూచించారు పవన్‌. గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పాలకొండ నుంచి మొత్తం ఐదుగురు ఆశావహులు టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో రాజకీయం ఉత్కంఠ భరితంగా మారింది. అయితే నిమ్మక జయకృష్ణకే టికెట్‌ ఖాయమన్న ప్రచారం కూటమి నాయకుల్లో ఉంది.రైల్వే కోడూరు సీటు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పవన్‌. యనమల భాస్కర్‌రావుకు బదులుగా ముక్కావారిపల్లె సర్పంచి అరవ శ్రీధర్‌కు సీటు కేటాయించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పవన్‌ ప్రకటించారు. మరోవైపు అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు జనసేన నేతలు. సీట్ల కోసం పార్టీలు మారిన వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటారంటూ మండిపడుతున్నారు. ఇన్నేళ్లు కష్టపడ్డవారిని గుర్తించకుండా పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు.జనసేన పోలవరం అభ్యర్థి బాలరాజును మార్చాలని పార్టీ అధిష్టానం యోచిస్తు్న్నట్లు సమాచారం. తాజా సర్వేలు బాలరాజుకు అనుకూలంగా లేవంటూ జనసేన అభ్యర్థిని మార్చే పనిలో పడింది. ఒకవేళ జనసేన టికెట్‌ కేటాయిస్తే… టీడీపీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు సూర్యచంద్రరావు. ఇక, ఎన్నికలు జరిగే మే 13 సమీపిస్తున్న తరుణంలో మార్పులు- చేర్పులు త్వరగా జరగాలని కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Related Posts