YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గేటు మారిస్తే ఫేటు మారుతుందా...

గేటు మారిస్తే ఫేటు మారుతుందా...

హైదరాబాద్, ఏప్రిల్ 6
తెలంగాణలో సెంటిమెంట్లు, వాస్తులు, పూజలు, యాగాలను ఎక్కువగా నమ్మే పొలిటీషియన్‌ లీడర్‌ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ముహూర్తం ప్రకారమే ప్రకటిస్తారు. ఎన్నికల వేళ యాగాలు, హోమాలు చేస్తారు. తన లక్కీ నంబర్‌ 6కు అనుగుణంగానే పనులు చేస్తారు. చివరకు తెలంగాణలో జిల్లాలను కూడా ఆయన అలాగే పునర్విభజన చేశారు. అంటే కేసీఆర్‌కు వాస్తు, లక్కీ నంబర్, పూజలపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇక పాత సచివాలయానికి వాస్తు దోశం ఉందని రూ.1000 కోట్లతో కొత్త సచివాలయమే కట్టించాడు. కానీ ఇన్ని చేసినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోక తప్పలేదు.ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ మరోమారు వాస్తు దోషాలనను వెతుక్కుంటున్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి అంతకుముందు 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడానికి కారణమైన తెలంగాణ భవన్‌కు వాస్తు దోషం ఉన్నట్లు ఇప్పుగు గుర్తించారు. భవనంకు వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని పండితులు గులాబీ బాస్‌కు సూచించారట. దీంతో వాస్తును ఎక్కువగా నమ్మే కేసీఆర్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ భవన్‌కు మార్పులు చేస్తున్నారు. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దీంతో కార్యాలయ సిబ్బంది మార్పులు చేస్తున్నారు.ఇదిలా ఉండగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌ నిర్మించారు. నిర్మాణ సమయంలోనే పూర్తి వాస్తు ప్రకారం చేపట్టారు. ఈ భవనం తూర్పు అభిముఖంగా ఉంది. అయితే, ప్రవేశ ద్వారం వాయువ్యం నుంచి ఉండడం సరైంది కాదని, ఈశాన్యం నుంచి ఉండాలని పండితులు తాజాగా సూచించారట. దీంతో మార్పులు చేయిస్తున్నారు. వాస్తు ప్రకారం మార్పులు చేసిన తర్వాతనే తెలంగాణ భవన్‌లో అడుగు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో వాస్తు మార్పులు మొదలు పెట్టారు. ఈ వాస్తు మార్పులు పార్టీకి ఊరటనిస్తాయని కేసీఆర్‌ భావిస్తున్నాట. మార్పులతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ధీమాతో ఉన్నారని సమాచారం. గేటుతోపాటు భవనంలో పార్టీ కార్యాలయంలో ఇంకొన్ని మార్పులు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ లేని దోషం ఇప్పుడెలా వచ్చిందని గులాబీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి ఈ కార్యలయంలో నిర్వహించిన సమావేశాలే కారణం. రెండుసార్లు ఇదే భవనం నుంచి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు అధికారం కోల్పోగానే తప్పిదం.. వాస్తు దోషంలో ఉందని పేర్కొనడం చూసి నవ్వుకుంటున్నారు. పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టకుండా, ఓటమికి కారణాలపై విశ్లేషణ చేయకుండా వాస్తు దోషాలను నమ్ముతూ పోతే బీఆర్‌ఎస్‌ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని కొందరు పేర్కొంటున్నారు.

Related Posts