యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎట్టకేలకు అధికారిక నివాసాలను ఖాళీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేశారు. లక్నోలో ఇన్నాళ్లుగా ఉంటున్న ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేసేందుకు విముఖత చూపిన నేతలు.. రెండేళ్ల గడువు కోరుతూ సుప్రీంకు వెళ్లిన విషయం తెలిసిందే. సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురవడంతో చివరికి ఖాళీ చేయక తప్పలేదు. మాజీ సీఎంలను 15 రోజుల్లోగా తమ అధికార నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ పని చేయడం ఇష్టంలేని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు లొసుగులను వెతికే ప్రయత్నం చేశారు. తమ తమ హయాంలో హంగూ ఆర్భాటాలతో నిర్మించుకున్న భవంతులను ఎలాగైనా తమ ఆధీనంలో ఉంచుకునేలా పావులు కదిపారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత మాయావతి సరికొత్త ఎత్తుగడలు వేశారు. ఆమె అధికార నివాసం ముందు మే 21 ఉదయం హఠాత్తుగా ఓ బోర్డు వెలిసింది. ‘శ్రీ కాన్షీరాం జీ యాద్గార్ విశ్రామ్ స్థల్’ అంటూ అక్కడ బోర్డు పెట్టారు. అంటే.. ఆ భవనాన్ని కాన్షీరాం మెమోరియల్‌గా మార్చారన్నమాట. తాను సీఎంగా ఉన్నప్పుడు వినియోగించిన ఆ అధికారిక భవనాన్ని వదులుకోవడం ఇష్టంలేని మాయావతి సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోడానికి ఈ ప్లాన్ వేశారు. మాయావతి రూ. 15 కోట్ల విలువైన మరో భవనంలోకి మారడానికి ఏర్పాట్లు చేసుకున్నా.. అధికార భవనాన్ని కూడా అట్టిపెట్టుకోడానికి ఈ ఎత్తుగడ వేశారు. ఆమె నూతన భవనంలోకి బుధవారమే అడుగుపెట్టారు. అధికార నివాసం తాళాలను స్పీడు పోస్టు ద్వారా ప్రభుత్వానికి పంపించారు. ఇదే కోవలో అఖిలేశ్ కూడా పావులు కదిపారు. తనకు లక్నోలో తన అధికార నివాసానికి తగిన ప్రత్యామ్నాయం దొరకడం లేదనీ, అందువల్ల మరో రెండేళ్ల పాటు అందులోనే నివాసం ఉండేలా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. యూపీ మాజీ సీఎంగా పనిచేసిన తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, అంతేకాకుండా ప్రస్తుతం తాను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, అందువల్ల తనను కలవడానికి నిత్యం అనేక మంది ప్రముఖులు, వీఐపీలు వస్తుంటారని ఆయన తెలిపారు.తన వ్యక్తిగత భద్రత చూసే అధికారులతో పాటు ఇతర అవసరాలన్నీ ఒకే చోట సమకూరే ప్రత్యామ్నాయ భవనం లక్నోలో లభించడం లేదని, అందువల్ల మరో రెండేళ్లు అధికార నివాసంలోనే ఉండే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. లక్నోలో మీకు సరిపడా భవనమే దొరక్కట్లేదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వెతికి పెట్టండని సవాలు కూడా విసిరారు. ఈ అధికారిక భవనాలన్నింటినీ తమ తమ హయాంలో ప్రభుత్వ ఖర్చుతో విశాల ప్రదేశంలో వైభవంగా, తమ మనసుకు నచ్చినట్లుగా నిర్మించుకున్నారు. అందువల్ల పదవి నుంచి దిగిపోయినా.. ఆ భవనాల్లోంచి వెళ్లిపోవడానికి నేతలకు మనసు రావడం లేదు. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోడానికి రకరకాల ఎత్తులు వేశారు. కానీ, నేతల పప్పులు ఏమాత్రం ఉడకలేదు. అనారోగ్యం, వయసు కారణాలుగా చూపిస్తూ సమయం ఇవ్వాల్సిందిగా ములాయం.. భద్రత, పిల్లల చదువులను కారణాలుగా చూపుతూ అఖిలేష్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. అంగీకారంకాని, మద్దతులేని విజ్ఞాపనలతో రాజ్యాంగ ఉల్లంఘనను సహించేది లేదని తేల్చి చెప్పింది.