ఏలూరు, ఏప్రిల్ 8
ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి… మరోవైపు మాజీ ఎమ్మెల్యే…. సొంత బలం, అభివృద్ధి సంక్షేమం పేరుతో ఒకరు… గత పాలన చెప్పుకుంటూ ఇంకొకరు…. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు తలపడుతున్నారు. హోరాహోరీ సమరానికి సై అంటున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాన్ని హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కనిపిస్తున్న పొలిటికల్ పిక్చర్… సూపర్ హిట్ మూవీని మరిపిస్తోంది… ఇద్దరు నేతలు డైలాగ్‌వార్‌తో అదరగొడుతుండటంతో పొలిటికల్ ఫైట్ పీక్స్‌కు చేరుకుంది… మరి ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది? తణుకు తీర్పు ఎలా ఉండబోతోంది…?తణుకు అంటే అభివృద్ధికి రోల్‌మోడల్. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తణుకు నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు పరిశ్రమల రాజధానిగా చెబుతారు. చెరకు ఫ్యాక్టరీతోపాటు వందలాది బియ్యం మిల్లులు, ఇతర పరిశ్రమలతో తణుకు నిత్యం కళకళలాడుతోంది. వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాంతంలో రాజకీయంగా పట్టు కోసం నేతలు ఎంతో శ్రమిస్తుంటారు. ప్రతి ఎన్నికను ప్రతిష్ఠకు తీసుకుంటారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మధ్య పొలిటికల్‌గా బిగ్‌ఫైట్ జరుగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, వ్యూహ, ప్రతివ్యూహాలతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దుమ్ము రేపుతున్నారు ఇద్దరు నేతలు.నియోజకవర్గంలో 2 లక్షల 33 వేల 082 ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లే ఎక్కువ. ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలను మహిళలే డిసైడ్ చేస్తారు. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళల ఓట్లపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ముఖ్యంగా తణుకు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా చెబుతారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక రెండుసార్లు కాంగ్రెస్, మరోసారి వైసీపీ విజయం సాధించాయి. అదేవిధంగా ఈ నాలుగు దశాబ్దాల్లో టీడీపీయేతర ఎమ్మెల్యేగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి తణుకు తన అడ్డాగా మార్చుకున్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి… 2014లో ఓడిపోగా, 2019లో తిరిగి పట్టు నిలుపుకున్నారు. ఇక రెండోసారి గెలిచిన కారుమూరికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిని చేశారు సీఎం జగన్.తణుకులో ఈ సారి కారుమూరి పోటీపై అనేక ఊహాగానాలు రేకెత్తాయి. నియోజకవర్గ మార్పుల్లో భాగంగా మంత్రి కారుమూరిని మరోచోటకు మార్చుతారనే ప్రచారం జరిగింది. కానీ, మంత్రి పనితీరుపై సర్వేలన్నీ సానుకూలంగా ఉండటంతో మళ్లీ తణుకు నుంచి పోటీకి అవకాశమిచ్చింది వైసీపీ.. ఇక టికెట్ ప్రకటన తర్వాతి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి…. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ స్వగ్రామంలో కూడా పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని చెబుతున్నారు మంత్రి.మంత్రి కారుమూరి ప్రచారంతో హోరెత్తిస్తుండగా, టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా జోరు పెంచారు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆరిమిల్లి రాధాకృష్ణ 2014లో తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడినా, నియోజకవర్గంలో క్యాడర్‌కు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు రాధాకృష్ణ. ఇక పొత్తుల్లో భాగంగా తణుకు జనసేనకు కేటాయిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పొత్తులకు ముందు తణుకు నుంచి జనసేన నేత విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించారు. అనూహ్యంగా తణుకు సీటును త్యాగం చేయాల్సి రావడంతో షాక్ తిన్నారు జనసేన ఇన్‌చార్జి విడివాడ.ప్రస్తుతం కూటమి అభ్యర్థి ఆరిమిల్లి ప్రచార కార్యక్రమాలకు జనసేన శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. ఆరిమిల్లి అభ్యర్థిత్వం ప్రకటించిన నుంచి విడివాడ సైలెంట్ అయిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎఫెక్ట్ కూటమి ఓటింగ్‌పై ఉంటుందేమోననే టెన్షన్ కనిపిస్తోంది. ఐతే మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మాత్రం అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తన ప్రచారానికి జనసేనతోపాటు బీజేపీ కార్యకర్తలను ఆహ్వానిస్తున్నారు. తనను గెలిపిస్తే తణుకు రూపురేఖలు మార్చుతానంటూ హామీనిస్తున్నారు.రెండు పార్టీలూ హోరాహోరీగా తలపడుతుండటంతో తణుకులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 33 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం ఓట్లే దాదాపు 55 వేలు ఉన్నాయి. ఇవికాక కమ్మ సామాజికవర్గం ఓట్లు 20 వేలు ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నాయి. ఇక బీసీ, ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎటు మొగ్గు చూపితే విజయం ఆ పార్టీని వరించినట్లేనని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈ ఓట్లపై రెండు పార్టీల్లోనూ ధీమా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు తమ పార్టీ వెంటే ఉంటారని మంత్రి కారుమూరి.. కూటమితో ఆ ఓట్లన్నీ గంపగుత్తగా టీడీపీకే వస్తాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆశలు పెట్టుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరి ఆశలు ఫలిస్తాయనేది ఎన్నికల్లోనే తేలనుంది.