ఏలూరు, ఏప్రిల్ 8,
మహాసేన రాజేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండిపెండెంట్ ప్యానల్ తో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. గత కొంతకాలంగా మహాసేన రాజేష్ టిడిపిలో యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే. అధికారికంగా టిడిపిలో చేరిన తర్వాత ఆయన.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అధికార వైసిపి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా కార్యక్రమాల్లో హోస్ట్ గా వ్యవహరించేవారు. ఈ తరుణంలో చంద్రబాబు మహాసేన రాజేష్ కు పి. గన్నవరం టికెట్ కేటాయించారు. అయితే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జనసేన తో పాటు బిజెపి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మహాసేన రాజేష్ విషయంలో పెను దుమారమే రేగింది. దీంతో రాజేష్ తనకు తానుగా పి. గన్నవరం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా టిడిపి వదులుకుంది. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న మహాసేన రాజేష్ ఇటీవల తెరపైకి వచ్చారు. కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘ నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ని, మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కుతుంది. అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబు కి క్షమాపణ చెప్పి పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధం’ అంటూ మహాసేన రాజేష్ తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం, మైనారిటీ, ఎస్సీ ప్రాబల్యం ఉన్న 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మహాసేన రాజేష్ డిసైడ్ అయ్యారు. 50 సీట్లలో ముస్లిం అభ్యర్థులను పోటీ చేయించనున్నట్లు ప్రకటించారు. ఇది ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం పోటీ అంటూ చెప్పుకొచ్చారు.అయితే బిజెపి పేరు చెప్పి వైసీపీని మహాసేన రాజేష్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకమని.. దేశమంతా ప్రతి రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్షం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. చివరకు గుజరాత్ లో కూడా బిజెపి కాంగ్రెస్ ప్రత్యర్థులన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆంధ్రాలో మాత్రం బిజెపికి ప్రతిపక్షం లేదని.. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసిన అది బిజెపికే పడుతుందని మహాసేన రాజేష్ తేల్చి చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసే వారికి తాము వేదిక అవుతామని ప్రకటించారు. అయితే మహాసేన రాజేష్ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసిపి ఓటు బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అధికం. అందుకే ఆ వర్గాల్లో చీలిక తెచ్చేందుకే మహాసేన రాజేష్ తో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు చంద్రబాబుపై గౌరవం ఉందంటూనే మహాసేన రాజేష్ ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది