గుంటూరు, ఏప్రిల్ 8,
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఆయన గెలుపొందుతారా? గత ఎన్నికల మాదిరిగా ఓటమి తప్పదా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ మంగళగిరి నియోజకవర్గ నుంచి పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. దీంతో లోకేష్ పొలిటికల్ కెరీర్ పైనే మాయని మచ్చ పడింది. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగిన యువనేతకు ఓటమి ఎదురైంది. ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఇక లోకేష్ పుంజుకోగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి ఎదురైనా.. పోయిన చోటే వెతుక్కోవాలని లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల మాదిరిగానే లోకేష్ ను దారుణంగా దెబ్బతీయాలని జగన్ భావిస్తున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ వేదికగా ఎత్తుకు పై ఎత్తులు కొనసాగుతున్నాయి.మంగళగిరి నియోజకవర్గం విషయంలో జగన్ కొత్త ప్రయోగాలకు తెర తీశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చారు. దీంతో మనస్థాపానికి గురైన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైసీపీ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆయన యూటర్న్ తీసుకున్నారు. వైసీపీలో చేరిపోయారు. మంగళగిరి అభివృద్ధి పై కీలక ప్రకటనలు చేశారు. దీంతో నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చేందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి రప్పించారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మురుగుడు లావణ్య పేరును ఖరారు చేశారు. ఆమెనే కంటిన్యూ చేస్తున్నారు. ఆమె ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు కుమార్తె, మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కోడలు.లావణ్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధికం. దీంతో ఏకపక్షంగా ఓట్లు పడతాయని భావించి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఒక అరడజను మందికి ఇన్చార్జిలుగా నియమించి తొలగించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించిన తర్వాత టిడిపి నుంచి రప్పించిన గంజి చిరంజీవికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయనే అభ్యర్థి అవుతారని అంతా భావించారు. కానీ ఆయనను తప్పించి లావణ్య కు అప్పగించారు. ప్రస్తుతం లావణ్య ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోవడంతో ఆయన నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో విజయ్ సాయి రెడ్డి మంగళగిరి చూడడం మానేశారు.పోనీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మురుగుడు లావణ్య కు అండగా నిలుస్తారనుకుంటే అది లేకుండా పోతోంది. కనీసం మాటవరసకైనా ఆయన మంగళగిరి నియోజకవర్గం లో కనిపించడం లేదు. అయితే మరో ప్రచారం బలంగా జరుగుతోంది.మంగళగిరి నియోజకవర్గంపై వైసీపీ చేపట్టిన సర్వేలో లోకేష్ స్పష్టమైన పట్టు సాధించారని తేలినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మురుగుడు లావణ్య కు మద్దతుగా కీలక నేతలు రాకపోవడంతో.. ఆమె సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఓడిన సీటును బలవంతంగా అంటగట్టారని.. ఆమె సైతం చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే లోకేష్ ను టార్గెట్ చేసుకుని జగన్ చేసిన వ్యూహాలు ఫెయిల్ అయినట్లు కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.