YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజమండ్రిలో ఓసీ వర్సెస్ బీసీ

రాజమండ్రిలో ఓసీ వర్సెస్ బీసీ

రాజమండ్రి, ఏప్రిల్ 10,
అసలు సిసలు రాజకీయానికి రాజమండ్రి కేంద్రంగా మారింది. అధికార, విపక్షాల మధ్య వ్యూహ, ప్రతివ్యూహాలతో పొలిటికల్‌ హీట్‌ రోజురోజుకు ఎక్కువవుతోంది. బలమైన సామాజిక వర్గం మద్దతుతో ఒకరు.. బీసీ ఓటు బ్యాంకును నమ్ముకుని మరొకరు బరిలోకి దిగుతున్నారు. ఒకరిది సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు.. తండ్రి వారసత్వంతో కేంద్రస్థాయిలో చక్రం తిప్పిన చరిత్ర అయితే… మరొకరు తొలిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నారు. వైద్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ కొత్త నేత…. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన మహిళా నేతను ఎలా ఢీకొడతారన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది..రంజైన రాజ‌కీయాల‌కు చిరునామా రాజ‌మండ్రి లోక్‌స‌భ నియోజకవర్గం. ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ప్రతి ఎన్నిక సమయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రాజమండ్రి ఎంపీగా ఎన్నికైన చాలామంది నేతలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సోద‌రులైన ప‌ట్టాభిరామారావు, స‌త్యనారాయ‌ణరావు రాజమండ్రి ఎంపీగా ఎన్నికవడమే కాకుండా, ఇద్దరూ కేంద్ర మంత్రులుగా ప‌ని చేశారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సైతం ఇక్కడి నుంచి రెండు సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.2014లో ప్రమ‌ఖ సినీ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ రాజమండ్రి ఎంపీగా ఎన్నికవగా, 2019 ఎన్నికల్లో ఆయన కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్‌ శాసనసభ బరిలో దిగడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది వైసీపీ. రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యుడు గూడూరి శ్రీనివాస్‌ అధికార పార్టీ తరఫున తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఎన్‌డీఏ కూటమి తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రిలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు.రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ, రూరల్‌తోపాటు రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వస్తాయి. మిగిలిన మూడు నియోజకవర్గాలైన కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనివి. ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా వారే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అందులోనూ కమ్మ సామాజికవర్గం హవాయే ఎక్కువ. ఐతే గత ఎన్నికల్లో ఈ ఆనవాయితీకి బ్రేక్‌ వేసింది అధికార వైసీపీ..సామాజికవర్గం కోటను బద్ధలుకొట్టి బీసీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించింది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ బీసీల్లోని శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ గుడూరి శ్రీనివాస్‌కు టికెట్‌ ఇచ్చింది. కూటమి తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. దీంతో రాజమండ్రి పార్లమెంట్‌లో మరోసారి కమ్మ వర్సెస్‌ బీసీ ఫైట్‌ ఆవిష్కృతం కాబోతోంది.రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారుగా 11 లక్షల ఓట్లు ఉన్నాయి. లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక జరుగుతుండటంతో శాసనసభా స్థానాల్లో గెలిచే అభ్యర్థుల అండతోనే ఎంపీ అభ్యర్థులు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే పార్టీయే ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇక్కడ రివాజుగా కనిపిస్తోంది. ఐతే ఈ సారి కూటమి తరఫున బీజేపీ పోటీ చేస్తుండటం, ఈ నియోజకవర్గం పరిధిలో ఒకే చోట నుంచి బీజేపీ అసెంబ్లీ బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీల ఓట్లు బదిలీ పెను సవాల్‌ విసురుతోంది.లోక్‌సభ పరిధిలో అనపర్తి సీటు నుంచి బీజేపీ పోటీ చేస్తుండగా, ఆ స్థానం వదులుకోడానికి సిద్ధంగా లేని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. తిరుగుబాటు జెండా ఎగరేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ తెగ హ్యాపీగా ఫీల్‌ అవుతోంది. కూటమిలో కల్లోలం ఎంత ఎక్కువ ఉంటే… తమ పార్టీ అభ్యర్థికి అంత మేలు జరుగుతుందని సంబరం పడుతోంది అధికార పార్టీ.రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గూడూరు శ్రీనివాస్‌ను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది వైసీపీ.. గత కొన్నేళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్‌ శ్రీనివాస్‌… జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యుడిగా జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్న ఆయనను పార్టీలోకి ఆహ్వానించి తొలుత, రాజమండ్రి సిటీ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ.. కానీ, డాక్టర్‌ శ్రీనివాస్‌కు ఉన్న గుర్తింపు దృష్ట్యా.. ఎమ్మెల్యే కన్నా, ఎంపీగా పోటీ చేస్తేనే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయనే అంచనాతో రాజమండ్రి లోక్‌సభ టికెట్‌ ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.కమ్మ వర్సెస్‌ బీసీ మధ్య జరుగుతున్న పోటీపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు బీసీ నేతలను బరిలోకి దింపింది వైసీపీ.. దీంతో మొత్తం ముగ్గురు బీసీ లీడర్ల ద్వారా లోక్‌సభను సునాయాసంగా గెలుచుకోవాలని ప్లాన్‌ చేస్తోంది. ఇక వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజానగరం, అనపర్తి స్థానాలు ఎంపీ అభ్యర్థి గుడూరికి సానుకూలత కనిపిస్తోందంటున్నారు. రాజానగరం నియోజకవర్గంతో గూడూరి శ్రీనివాస్‌కు విశేషమైన అనుబంధం ఉందంటున్నారు. ఇక గత ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ కూటమి అభ్యర్థి ఎంపికపై రచ్చ జరుగుతుండటం వైసీపీకి అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వు నియోజకవర్గాలైన కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తున్నారు. నిడదవోలులో జనసేన, టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి కనిపిస్తోంది. నియోజకవర్గంలో వైసీపీకి కొంత సానుకూలత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ మూడు నియోజకవర్గాలపై గూడూరి శ్రీనివాస్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఓటర్లను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి… కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండటంతోనే రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది తన సామాజికవర్గం నేతలే కావడం, తన సామాజిక వర్గ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమయ్యారు పురందేశ్వరి. కూటమి ఓట్లు, తన తండ్రి ఎన్టీఆర్‌ ఇమేజ్‌, ప్రధాని మోదీ పట్ల ఉండే సానుకూలత వంటివన్నీ తనకు లాభిస్తాయని అంచనా వేస్తున్నారు పురందేశ్వరి. రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం పురందేశ్వరికి ప్లస్‌గా చెబుతున్నారు. అంతేకాకుండా.. రాజమండ్రి సిటీ, రూరల్‌, రాజానగరం స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలంగా ఉండటం పురందేశ్వరికి అడ్వాంటేజ్‌ అంటున్నారు. కొవ్వూరు గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కూటమి బలం కూడా పురందేశ్వరికి సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు.మొత్తానికి రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది

Related Posts