YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే కొడుకు కోసం 15 మంది అధికారుల బలి

మాజీ ఎమ్మెల్యే కొడుకు కోసం 15 మంది అధికారుల బలి

నిజామాబాద్, ఏప్రిల్ 10
ఓ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే మూడు దశల్లో అర్హతలు సాధించాలి. ఓ ఎస్ ఐ ఉద్యోగం పొందాలంటే మూడు దశల్లో కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి.. ఓ గ్రూప్ -1, గ్రూప్ -2 స్థాయి ఉద్యోగాలు దక్కించుకోవాలంటే అహో రాత్రులు శ్రమించాలి. నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీపట్టాలి. ఇంత కష్టపడినా ఒక్కోసారి కొలువు దక్కుతుందో లేదో.. ఇంత ప్రయాస పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే.. చివరికి పోస్టింగ్ కోసం ప్రజా ప్రతినిధుల రికమండేషన్.. కోరుకున్నచోట పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేకో ఎంపీ కో డొనేషన్.. తీరా పోస్టింగ్ దక్కించుకున్న తర్వాత.. ఇచ్చిన డబ్బులను మళ్లీ సంపాదించుకునేందుకు జనం మీద పడటం.. ఇదే కదా గత ప్రభుత్వంలో పదేళ్లపాటు జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ..మరీ ఈ స్థాయిలో దిగజారలేదు. ఎమ్మెల్యే రికమండేషన్ ఉంటేనే ఎస్ఐకి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో దర్జాగా సాగింది. సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులైతే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఏసీపీ, సీపీ, ఐజీ ర్యాంకు అధికారులు పోస్టింగ్ పొందాలంటే ప్రభుత్వ పెద్దల ప్రాపకం ఉండాల్సిందే. అలా ప్రజాప్రతినిధుల భజనకు అలవాటు పడిన కొంతమంది పోలీసులు ఆ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చారు. అలాంటి ఉదంతాలు అప్పట్లో ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో పోలీసులు ఎమ్మెల్యే లకు కట్టు బానిసలయితే ఎలా ఉంటుందో కళ్ళకు కడుతుంది. అంతేకాదు వ్యవస్థకు విరుద్ధంగా పనిచేస్తే ఎలాంటి పరిస్థితిని ఎదురుకోవాల్సి వస్తుందో అవగతమవుతుంది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అప్పట్లో ప్రజాభవన్ ఎదుట రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. మద్యం మత్తులో ఖరీదైన వాహనంలో విపరీతమైన వేగంతో దూసుకు వస్తూ ప్రజాభవన్ ఎదుట డివైడర్ ను ఢీ కొట్టాడు. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు అతడిని తప్పించేందుకు.. చిత్ర విచిత్రమైన ప్రణాళిక అమలు చేశారు. రహీల్ ను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే రహీల్ ను వేరే కారులో పంపించారు. సంఘటన స్థలానికి రహీల్ డ్రైవర్ ను రప్పించారు. అతడే ప్రమాదం చేసినట్టు చిత్రీకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో షకీల్ కుమారుడే ప్రమాదానికి కారణమని తెలియడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం విడిచి వెళ్లిపోయాడు. అతడిని కాపాడేందుకు 14 మంది పోలీసులు తెరవెనక ప్రయత్నం చేశారు. ఇద్దరు సీఐలు, 12 మంది తాము ఖాకీ ఉద్యోగం చేస్తున్నామనే ఇంకితాన్ని మర్చిపోయి మాజీ ఎమ్మెల్యే కుమారుడిని కాపాడేందుకు గులాం గిరి చేశారు. చివరికి దొరికిపోయారు.మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం నుంచి పారిపోయిన నేపథ్యంలో పోలీసులు అతడి పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. దీంతో కాళ్ళ బేరానికి వచ్చాడు. తిరిగి స్వదేశానికి రావడంతో.. పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.. అతడిని జైలుకు తరలించారు.. ఈ వ్యవహారంలో రహీల్ ను కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులు, మాజీ ఎమ్మెల్యే పై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు వారంతా జైలుకు వెళ్లారు. ఈ ఉదంతం రాష్ట్ర పోలీసులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారని అభియోగాలు ఎదుర్కొంటూ కీలక పోలీస్ అధికారులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఉన్నత అధికారులుగా ప్రజల మన్ననలు పొందాల్సిన వారు.. ఖైదీలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ఉదంతంలోనూ ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఈ ఉదంతాలను బట్టి పోలీసులు, ప్రభుత్వ అధికారులు తెలుసుకోవాల్సిందేంటంటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలకు సాగిల పడితే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తే సరిపోతుంది. అంతేగాని ప్రజాప్రతినిధులకు సాగిలపడితే.. ఇదిగో ఇలానే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

Related Posts