నిర్మాణ సంస్థ: ఎ కంపెనీ ప్రొడక్షన్
తారాగణం: నాగార్జున అక్కినేని, మైరా సరీన్, అజయ్, షాయాజీ షిండే, ఫిరోజ్ అబ్బాసీ, బేబి కావ్య తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: ఎన్.భరత్‌వ్యాస్, రాహుల్ పెనుమత్స
కూర్పు: అన్వర్ అలీ, ఆర్.కమల్
నిర్మాతలు: రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర
దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ
నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్ అనగానే ఎవరికైనా చటుక్కున గుర్తుకొచ్చే పేరు `శివ`. తెలుగు సినిమాల్లో మైలురాయిగా నిలిచిన శివ సినిమా తర్వాత గోవిందా గోవింద, అంతం సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు ఉండటం సహజం. వర్మలో విషయం తగ్గిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో వర్మ ఓపెన్ చాలెంజ్ చేశాడు. `ఆఫీసర్` సినిమాను తాను అందరూ మెచ్చుకునేలా తీస్తానని... ఒక పక్క సెన్సేషనల్ కాంబినేషన్.. మరో పక్క వర్మ ఛాలెంజ్ అన్ని సినిమాపై అంచనాలను పెంచడంలో సక్సెస్ అయ్యాయి. మరి ఆఫీసర్ ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించాడో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
నారాయణ పసారి ముంబైలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. అండర్‌వరల్డ్‌ను నామరూపాలు లేకుండా చేసిన నారాయణ పసారి ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ చేశాడనే కేసు వేస్తారు కొందరు. దాంతో హైకోర్టు ఆయనపై ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ టీమ్‌కు హైదరాబాద్‌కు చెందిన శివాజీరావ్(నాగార్జున)ను పైఅధికారిగా నియమిస్తారు. ముంబై వచ్చిన శివాజీ కేసును పరిశోధించి ఓ సాక్ష్యాన్ని సేకరిస్తాడు. దాంతో నారాయణ పసారిని అరెస్ట్ చేస్తారు కూడా. అయితే సాక్షిని ఎవరో చంపేస్తారు. దాంతో నారాయణ పసారి కేసు నుండి నిర్దోషిగా బయటకొస్తాడు. అదే సమయంలో ఓ అండర్‌వరల్డ్ టీంను క్రియేట్ చేసి నగరంలో పేరు మోసిన వ్యక్తులను చంపించేస్తాడు. దాంతో ప్రభుత్వం ఓ స్పెషల్ ఎన్‌కౌంటర్ టీమ్‌ను ఏర్పాటు చేసి దానికి నారాయణను చీఫ్‌ను చేస్తారు. నారాయణ తెలివిగా గేమ్ ఆడి శివాజీకి, అండర్ వరల్డ్ టీంకు సంబంధం ఉందని అందరినీ నమ్మిస్తాడు. అప్పుడు శివాజీ ఏం చేస్తాడు? తనపై పడ్డ నింద నుంచి ఎలా తప్పించుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
‘శివ’ వంటి సినిమా తర్వాత నాగ్, వర్మ సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా కొన్ని అంచనాలుంటాయనడంలో సందేహం లేదు. అదే అంచనాలతోనే సినిమా రూపొందింది. అయితే సినిమా కథలో కొత్తదనం లేదు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీస్తానని.. వర్మ ప్రతిజ్జ చేశాడు కానీ సినిమాను తనకు నచ్చిన గ్యాంగ్‌స్టర్స్ మూవీ తరహాలోనే తెరెక్కించాడు. సాధారణంగా గ్యాంగ్‌స్టర్స్ మధ్య పోరాటాన్ని చూపించే వర్మ ఈసారి పోలీసుల మధ్య గొడవలు జరిగితే ఎలా ఉంటుందో చూపించాడంతే. గొప్పగా ఏమీ లేదు. చైల్డ్ సెంటిమెంట్, ఎమోషన్స్ ఉన్నాయంటే ఉన్నాయనిపిస్తాయి.. కనెక్ట్ కావు. ఇక ఎప్పటిలాగానే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆక్టటుకుంది. అయితే కొన్నిచోట్ల కిల్లింగ్ వీరప్పన్ సౌండింగ్ మార్చి వాడారేమోనని కూడా అనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ ఓకే.
నారాయణ పసారి అనే సిన్సియర్ ఆఫీసర్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా మారిపోవడానికి బలమైన కారణాలు చూపించలేదు. ఓ పోలీస్ అండర్ వరల్డ్ గ్యాంగ్‌ను మెయిన్‌టెయిన్ చేయడం..మాఫియా, గొడవలు, ఎన్‌కౌంటర్స్ అన్నీ ఏదో ఒక రూపంలో వర్మ సినిమాల్లో చూసేసినవే. క్యారెక్టరైజేషన్స్ పూర్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాలేవు. ఫస్టాఫ్ ఓకే కానీ.. సెకండాఫ్ బోరింగ్.
రేటింగ్ : 2/5