YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హిందూపురంలో టీడీపీకి గట్టి పోటీ...

హిందూపురంలో టీడీపీకి గట్టి పోటీ...

అనంతపురం, ఏప్రిల్ 12
చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే… నందమూరి నటసింహాం ఫేమస్‌ డైలాగ్‌ ఇది… సినిమాల్లో సూపర్‌ హిట్‌ అయిన డైలాగ్‌తో రాజకీయాల్లోనూ వర్కౌట్‌ చేయాలనుకుంటున్నారు బాలయ్య. ఓటమంటే తెలియని హిందూపురంలో మూడోసారి గెలిచి హాట్రిక్‌ కొట్టాలనుకుంటున్న బాలయ్యకు చెక్‌ చెప్పేందుకు భారీ స్కెచ్చే వేసింది వైసీపీ.నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగరని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్‌ ఇవ్వాలనుకుంటోంది. రాయలసీమకే పెద్ద దిక్కైన పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది. వైరిపక్షాలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో హిందూపురం ఎన్నిక హోరాహోరీగా మారింది. ఇంతకీ ఏ పార్టీ ఎత్తుగడ ఏంటి?రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గం పేరు చెబితే గుర్తొచ్చేది రెండే రెండు. ఒకటి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌, రెండోది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అంటే హిందూపురం.. హిందూపురం అంటే టీడీపీ అన్నట్లు ప్రజల మదిలో సుస్థిరమైపోయింది ఆ నియోజకవర్గం. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో మరోపార్టీ జెండా ఎగరలేదు. అంతేకాదు టీడీపీ వ్యవస్థాపకుడు, అన్న ఎన్టీఆర్‌ వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తదనంతరం ఎన్టీఆర్‌ వారసుడిగా హరికృష్ణ, ఈయన తర్వాత మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హాట్రిక్‌ ప్రయత్నాల్లో ఉన్నారు.టీడీపీకి కంచుకోటగా మారిన హిందూపురంపై అధికార వైసీపీ భారీ స్కెచ్‌ రెడీ చేసింది. నాలుగు దశాబ్దాల టీడీపీ రికార్డును ఈ సారి బ్రేక్‌ చేసేందుకు పకడ్బందీ పావులు కదుపుతోంది. ఇన్నేళ్లుగా టీడీపీ గెలుస్తుందంటే దానికి ఆ పార్టీ బలంకన్నా.. ప్రత్యర్థుల మధ్య ఐక్యత లోపించడమే ప్రధాన కారణంగా గుర్తించిన వైసీపీ.. ఈ సారి హిందూపురంలో టీడీపీ వ్యతిరేకులు అందరినీ ఒకేతోవలో పెట్టేలా పావులు కదుపుతోంది. కొంతవరకు ఆ ప్రయత్నాల్లో సక్సెస్‌ అయింది. దీనికి కారణం వైసీపీలో నెంబర్‌ టూ లీడర్‌, సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటున్నారు. హిందూపురంలో గెలవాలన్న ఏకైక టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్‌.. ఈ సారి కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను అభ్యర్థిగా ప్రకటించారు. దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్‌.ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన బాలకృష్ణ 2014లో హిందూపురంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం తన తండ్రి, సోదరుడి మార్గంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచిన బాలయ్య.. 2019 ఎన్నికల్లో కూడా మరోసారి జయకేతనం ఎగరేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం.. బాలయ్య హవానే కనిపించింది. అంతేకాదు 2014 కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నారు బాలయ్య. అందుకే ఈసారి వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురంలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఏడాది క్రితం నుంచి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది.హిందూపురంలో బాలయ్య ప్రత్యర్థులుగా 2014లో నవీన్‌ నిశ్చల్‌, 2019లో మైనార్టీ నేత ఇక్బాల్‌ పోటీ చేశారు. ఐతే ఈ ఇద్దరికి నియోజకవర్గంలో ఇతర నేతలతో సఖ్యత లేకపోవడం వల్ల బాలయ్యపై విజయం సాధించలేకపోయారు. దీంతో ఈ సారి ఈ ఇద్దరినీ కాదని కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దించింది వైసీపీ. ఇప్పటివరకు నవీన్‌ నిశ్చల్‌, ఇక్బాల్‌, చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య, ఇక్బాల్‌ రాజీనామాతో ఇప్పుడు అంతా దీపిక వెనుక నడుస్తున్నారు. ఇలా హిందూపురంలో కేడర్‌ అంతా ఒకే గూటికి చేరడానికి తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డికి హిందూపురం బాధ్యతలు అప్పగించడం, ఆయన ఓ వారంపాటు నియోజకవర్గంలో తిష్ఠవేసి మొత్తం సెట్‌ చేయడంతో ప్రస్తుతానికి పార్టీ ఏకతాటిపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది.హిందూపురంలో గెలుపు బాధ్యతలు తీసుకున్న రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ టీడీపీ అంటూ పావులు కదుపుతున్నారు. ఆయన ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలివ్వడంతో ప్రస్తుతం నవీన్ నిశ్చల్‌, చౌళూరు వర్గీయులు దీపికకు మద్దతు పలుకున్నారు. వాస్తవానికి వైసీపీలో వర్గ విభేదాల వల్లే టీడీపీ విజయాలకు కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఈసారి అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన తర్వాత బాలకృష్ణకు పక్కా స్కెచ్ వేయాలని నిర్ణయించారు. పార్టీ నేతల అండదండలు లభిస్తుండటం, నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సారి పసుపు కోటను బద్ధలు కొడతానని అంటున్నారు దీపిక. బాలయ్యపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.హిందూపురం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ.. పార్టీ ఓటు బ్యాంకుపై ధీమాతో మూడోసారి గెలుపుపై నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అవుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వ్యక్తిగతంగా బాలయ్య చేసిన సాయం ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తాగునీటి సమస్య పరిష్కారం, ఆసుపత్రి నిర్మాణం వంటివి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చి పెట్టాయని చెబుతున్నారు. అయితే ఆయనకు అంతకుమించిన మైనస్లు ఉన్నాయంటున్నారు. రెండు నెలలకో మూడు నెలలకు ఒకసారి చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తుంటారని.. కార్యకర్తలకు సంబంధించిన శుభకార్యాలు ఉంటేనే కనిపిస్తారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా బాలయ్యను నేరుగా కలిసే అవకాశం లభించడం లేదని, పీఏల పాలనపై ప్రజలు విరక్తిగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో వైసిపి అభ్యర్థి కురుబ దీపికకు కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ క్యాడర్‌ అంతా ఏకతాటిపై ఉండటం ఆమెకు ప్లస్‌గా చెబుతున్నారు. ఇదే సమయంలో హిందూపురంలో టీడీపీని ఓడించేంత శక్తిని ఆమె సాధించారా? అనే సందేహం వెంటాడుతోంది. ఏదిఏమైనా హిందూపురంలో తొలిసారి గట్టిపోటీని ఎదుర్కొంటోంది టీడీపీ. నాలుగు దశాబ్దాల కంచుకోటను కాపాడుకోడానికి శక్తివంచన లేకుండా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి వ్యూహం ప్రకారం నడుస్తున్న వైసీపీ.. హిందూపురంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సివుంది.

Related Posts