విజయవాడ, ఏప్రిల్ 12
ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు రెగ్యులర్ లో పాస్ అయ్యారా.?, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా.? వంటివి మార్కుల జాబితాలో ఏమీ వివరాలు ఉండవని.. విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు క్షణికావేశానికి లోను కావద్దని అన్నారు.
ఇంటర్ పేపర్ల మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులకు మార్కులపై ఏమైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి 24 వరకూ ఫీజు చెల్లించాలని సూచించారు. అనంతరం ఆ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే, సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ కోసం విద్యార్థులు ఈ నెల 18 నుంచి 24 వరకూ ఫీజు చెల్లించాలని వివరించారు. ఫీజు వివరాలు, పరీక్షల టైం టేబుల్ వివరాలు అన్నీ అధికారిక వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే రికార్డుస్ధాయిలో ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం. ఫలితాల్లో ఎప్పటిలాగా కృష్ణా జిల్లా 84 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. గుంటూరు జిల్లా 81 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా అధికారులు ఫలితాలు విడుదల చేశారు.