శ్రీకాకుళం, ఏప్రిల్ 13
ఆ ఇద్దరి నేతలది ఒకే ఊరు. ఎమ్మెల్యే పదవికి హోరాహోరీగా తలపడుతున్నారు. ఒకరిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం…. రాష్ట్రస్థాయి పదవులను చేపట్టిన అనుభవమైతే.. ఇంకొకరిది సామాన్య కుటుంబం.. బడా నేతలను ఎదిరించి ఎమ్మెల్యేగా గెలిచిన చాకచక్యం. గత రెండు ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించగా, ఈ ఎన్నికల్లో మరోసారి నువ్వా-నేనా అన్నట్టు ఢీకొడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? కాబోయే ఎమ్మెల్యే ఎవరు?శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం రాజకీయ సంచలనాలకు కేంద్రం. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు 2 లక్షల 13 వేల ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా వెలమ సామాజికవర్గం ఓటర్లు ఉండగా, రెండో స్థానంలో కళింగ, మూడో స్థానంలో కాపు ఓటర్లు ఉన్నారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ వెలమ సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు.ముఖ్యంగా ధర్మాన కుటుంబంతోపాటు, బగ్గు, శిమ్మ కుటుంబాలే ఎక్కువ కాలం ఎమ్మెల్యే పదవులను అనుభవించారు. ప్రస్తుత రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సొంత నియోజకవర్గమైన నరసన్నపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ధర్మాన. 1989, 1999 ఎన్నికల్లో నరసన్నపేట నుంచి గెలిచిన ధర్మాన 2004 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గానికి మారారు. ఇక ప్రస్తుతం పరస్పరం తలపడుతున్న ఇద్దరు నేతల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి కాగా, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.ధర్మాన కృష్ణదాస్, బగ్గ రమణమూర్తి మూడోసారి పరస్పరం తలపడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరు నేతలు 2014లో ముఖాముఖి తలపడితే బగ్గు రమణమూర్తిని విజయం వరించింది. ఇక రెండోసారి గత ఎన్నికల్లో మళ్లీ ఈ ఇద్దరి మధ్యే పోటీ జరగ్గా… ధర్మాన కృష్ణదాస్ ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణదాస్… సీఎం జగన్ క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. మూడేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వవస్థీకరణలో కృష్ణదాస్ తప్పుకుని ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్, బగ్గు రమణమూర్తి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. ఈ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గంలో ధర్మాన కుటుంబానికి గట్టిపట్టు ఉండగా, ఐదేళ్లు ఎమ్మెల్యేగా గెలిచిన బగ్గు రమణమూర్తి కూడా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ధర్మాన కృష్ణదాస్… ఈ ఎన్నికల్లో తన కుమారుడిని పోటీకి పెట్టాలని భావించారు. కానీ, సీఎం జగన్… కృష్ణదాస్‌నే మరోసారి పోటీ చేయమని ఆదేశించడంతో రంగంలోకి దిగాల్సి వచ్చిందంటున్నారు. సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న కృష్ణదాస్ కూల్ పాలిటిక్స్ చేస్తుంటారనే పేరు తెచ్చుకున్నారు. ఐతే ఎన్నడూ లేనట్లు ఈ సారి ఎన్నికల్లో ధర్మాన కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సోదరుడు ధర్మాన ప్రసాదరావు వర్గంతో కొంత గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు సొంత పార్టీలో కొందరు ద్వితీయశ్రేణి నేతలు ధిక్కార స్వరం వినిపిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మండల స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నేతలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను అనుభవిస్తున్న వారే కృష్ణదాసుకు కంట్లో నలుసులా మారడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే పార్టీలో వర్గాలు ఉండటం చాలా కామన్ అన్నట్లు అన్నింటిని లైట్‌గా తీసుకుంటున్న ధర్మాన కృష్ణదాస్.. తన పని తాను చేసుకుపోతున్నారు. కలిసివచ్చిన వారిందరికీ ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని… ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల ఫలితమే రిపీట్ అవుతందని ధీమా ప్రదర్శిస్తున్నారు.ఇక టీడీపీ నుంచి మూడో సారి బరిలో దిగతున్నారు బగ్గు రమణమూర్తి.. గ్రామస్థాయి నుంచి రాజకీయాలు చేసిన రమణమూర్తి 2014-19 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. వాస్తవానికి నరసన్నపేట నియోజకవర్గం ధర్మాన కుటుంబ సభ్యుల అడ్డాగా చెబుతారు. కానీ, పోటీ చేసిన తొలిసారే ధర్మాన కృష్ణదాస్‌పై విజయం సాధించడం ద్వారా రమణమూర్తి సత్తా చాటుకున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో ఓడిపోయిన రమణమూర్తి… ఈ సారి విక్టరీపై చాలా ఆశ పెట్టుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న లుకలుకలే తనకు కలిసివస్తాయనే అంచనాతో ఉన్నారు రమణమూర్తి. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాను ఎమ్మెల్యేగా చేసిన పనులను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.మొత్తానికి నరసన్నపేట నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ధర్మాన కోటను బద్ధలుకొట్టిన బగ్గు రమణమూర్తి మరోసారి చాన్స్ ఇవ్వాలని కోరుతుంటే.. తమ కంచుకోటను కాపాడుకోడానికి ధర్మాన కుటుంబం కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. ఒకే గ్రామం, ఒకే సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి కాబోతుందనేది ఆసక్తిరేపుతోంది.