- ఐరాస ఎదుట ప్లకార్డులు పట్టిన శునకాలు
ఐక్యరాజ్యసమితి: ప్రభుత్వాలేవైనా.. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా జరిగే ప్రయత్నాలేవైనా జరిగితే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తమ నిరసన గళం వినిపించడం సహజమే. సమాజానికి చేటు చేసే చర్యలను ఖండిస్తూ ప్లకార్డులను చేతబట్టి నల్లబ్యాడ్జీలతో రోడ్లపైకి వచ్చి నినాదాలతో తమ అసంతృప్తిని చాటుతుంటారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలతో తమ అసమ్మతిని ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితులే మూగజీవాలకు వస్తే.. అవి ఎక్కడకు వెళ్లాలి. తమ జాతికి చేటుచేసే ప్రయత్నాలపై నిరసన గళాన్ని ఎలా వినిపించాలి? మూగజీవాలు నిరసన తెలపడమేమిటని ఆలోచిస్తున్నారా? నిజమే.. తమ జాతిపై జరుగుతున్న ప్రయోగాలను వ్యతిరేకిస్తూ ఏకంగా ఐక్యరాజ్యసమితి ముందే ఎనిమిది శునకాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా మనుగడకు ముప్పు వచ్చేలా ఉంది. మీ ఆవిష్కరణల కోసం మమ్మల్ని బలి చేయకండి’’అంటూ బాడీ షాప్, క్రూయాలిటీ ఫ్రీ ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ జాగిలాలు నిరసనకు దిగాయి. జంతువులపై జరుగుతున్న కాస్మోటిక్ ప్రయోగాలకు వ్యతిరేకంగా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పాటుపడుతున్నాయి. దీనికోసం వారు శిక్షణ ఇచ్చిన శునకాల మెడలో ప్లకార్డులను వేసి, వెనుక బ్యానర్లతో నిరసన చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా జంతువులు చేపట్టిన తొలి నిరసన ఇదే. రసాయనాలతో కూడుకున్న ప్రయోగాల మూలంగా సంవత్సరానికి సుమారు రెండు లక్షల జంతువులు వీటి ప్రభావానికి లోను అవుతున్నాయని అంతర్జాతీయ హ్యూమన్ సొసైటీ పేర్కొంది.
‘‘జంతువులపై జరుపుతున్న కాస్మోటిక్ ప్రయోగాలకు నిరసనగా జూన్ 2017 నుంచి ఎనిమిది మిలియన్ల మద్దతుతో సంతకాలను సేకరించాలనుకున్నాం. ఇప్పటివరకూ 4.1మిలియన్ల వరకూ పూర్తి అయ్యాయి. త్వరలోనే మిగతావి సేకరించి పూర్తి స్థాయిలో ఐరాసకు అందజేస్తామని’’ భారత బాడీ షాప్ మార్కెటింగ్ అధినేత ఆరాధికా మెహతా తెలిపారు. ఒకవైపు శునకాలు ఎంతో విశ్వాసం ఉన్న జంతువులంటూ వాటి పట్ల ప్రేమను చూపిస్తున్నాం. మరోవైపు మాత్రం వాటిపై ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నామంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానవులతో అత్యంత సన్నిహితంగా ఉండే జంతువులు శునకాలు మాత్రమే. వాటికి కావాల్సిన శిక్షణ అందించి వాటితోనే నిరసనకు దిగామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే ఈ కాస్మోటిక్ ప్రయోగాలను నిషేధించాయి. కానీ సుమారు 80శాతం వరకు దేశాలు ఈ ప్రయోగాల గురించి ఎలాంటి చట్టాలు చేయలేదు. భారత్‌లో మాత్రం వీటిని పూర్తిగా నిషేధించారు.
కాస్మోటిక్ టెస్టింగ్..
మానవ సంబంధిత లేపనాలు(సబ్బులు, శాంపులు, సుగంధలేపనాలు) తయారీ అనంతరం వాటిని ముందుగా జంతువులపై ప్రయోగిస్తారు. వాటి పనితీరు సజావుగా ఉంటే అనంతరం మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ముఖ్యంగా చర్మం, కళ్లకు సంబంధించిన లేపనాల విషయంలో వీటి ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి.