అనంతపురం, ఏప్రిల్ 13,
బాలయ్య అంటే ముక్కుసూటి తత్వం.. బాలయ్య అంటే టెంపర్.. బాలయ్య అంటే టెర్రర్.. తేడా వస్తే ఆయన చేతితోనే సమాధానం చెబుతారు.. ఇది బయట ఉన్న టాక్. అయితే సినిమావాళ్లు మాత్రం ఆయన మనసు వెన్న అని చెబుతుంటారు. చిన్నపిల్లాడి మనస్థత్వం అని.. తమతో ఎంతో బాగుంటారని చెప్పడం చాలాసార్లు విన్నాం. కానీ వాళ్లు చెప్పే మాటలకు.. బాలయ్య బయట ప్రవర్తనకు పొంతన ఉండదు. ఇప్పటికే చాలాసార్లు తమ అభిమానులపై చేయి చేసుకున్నారు. కొట్టడం బాలయ్యకు… కొట్టించుకోవడం ఆయన ఫ్యాన్స్‌కు అలవాటు అయిపోయినట్లుంది. ఇలాంటి ఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి అభిమానిపై చేయిచేసుకున్నారు బాలకృష్ణ. కదిరిలో బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి నెట్టుకోవడంతో.. బాలయ్య ఆగ్రహానికి గురయ్యారు. ఆగ్రహంతో అభిమానిని మోచేతితో కొట్టారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ మారింది. అయితే బాలయ్య స్థాయి సెలబ్రిటీలు ఎవరు బయటకు వెళ్లినా బౌన్సర్లను పెట్టుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ ఎగబడినప్పుడు బౌన్సర్లే తొయ్యడం, నెట్టడం వంటివి చేస్తుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం బౌన్సర్లను పెట్టుకోరు. తన ఫ్యాన్స్‌ను మందలించినా, వాయించినా అది తానే అయి ఉండాలని.. తన అభిమానులపై మరొకరు చేయి చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని ఓ సెలబ్రిటీ గతంలో వ్యాఖ్యానించారు.