హైదరాబాద్, ఏప్రిల్ 13
వైయస్ విజయమ్మ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పిల్లలిద్దరూ ప్రత్యర్థులుగా మారడంతో ఎవరి వైపు ఉండాలో తెలియక సతమతమవుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు ఆమె ఒక సామాన్య గృహిణి. ఏనాడైతే ఆయన అకాల మరణం చెందారో కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం బయటకు రావాల్సి వచ్చింది. ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఓటమిలు తప్పలేదు. నిట్టూర్పులు తప్పలేదు. అయితే కుమారుడు చేతికి అధికారం రావడంతో సంతృప్తి చెందిన ఆమెకు.. కుమార్తె షర్మిల రూపంలో కొత్త చిక్కులు ఎదురయ్యాయి. అన్నకు అండగా నిలిచిన ఆమెకు.. సరైన గుర్తింపు, అనుకున్న ఫలితం రాకపోవడంతో రాజకీయంగా విభేదించడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థికి మించి శత్రువుగా మారిపోయారు. ఈ క్రమంలో ఎవరి వైపు ఉండాలో తెలియక విజయమ్మ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యారు. ఎన్నికల వరకు అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైయస్ కుటుంబం. నాలుగున్నర దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుంది ఆ జిల్లా. కానీ వైయస్ కుటుంబంలోనే హత్య రాజకీయాలు బయటపడ్డాయి. వివేకానంద రెడ్డిని సొంత కుటుంబమే హత్య చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతాయి. అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా దీనినే ధ్రువీకరించింది. అప్పటినుంచి ప్రారంభమైన చీలిక.. నేడు షర్మిల పిసిసి పగ్గాలు తీసుకున్నంతగా తీవ్ర రూపం దాల్చింది. కడప నడిబొడ్డుపై నువ్వా నేను అన్నట్టు అన్నా చెల్లెలు పోరాడుతున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంతో.. తన అవసరం ఉంటుందని చెప్పి మరి విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. గౌరవంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అదే షర్మిల ఏపీ రాజకీయాలకు రావడం, కుమారుడికి ప్రత్యర్థిగా నిలవడం విజయమ్మకు డిఫెన్స్ లో పెట్టింది. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలో అంతు పట్టడం లేదు. దీనికి తోడు వైయస్ వివేకానంద రెడ్డి హత్యతో ఆమె మనసు కకావికలం అయింది. ఎటు చూసినా కుటుంబ పరువు పోతుందని ఆమె బాధపడుతున్నారు. అందుకే ఈ ఎన్నికలకు ఇక్కడ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు.సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరిట నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర ఇడుపాలపాయలో ప్రారంభమైంది. ఆ సమయంలో హాజరైన విజయమ్మ.. కుమారుడు జగన్ ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించింది. శుభాకాంక్షలు చెప్పింది. అక్కడ కొద్ది రోజులకి షర్మిల సైతం కడప జిల్లాలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆమె సైతం తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో కూడా విజయమ్మ హాజరయ్యారు. కుమారుడు జగన్ మాదిరిగానే కుమార్తె షర్మిలను దీవించారు. దీంతో ఇదేంటి కుటుంబ రాజకీయం అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఒకానొక దశలో విజయమ్మ సైతం టార్గెట్ అయ్యారు. ఆమె డైరెక్షన్లోనే పిల్లలు ఇద్దరు రాజకీయాలు ప్రారంభించారన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు విజయమ్మ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని టాక్ నడిచింది. అటు షర్మిల సైతం ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో విజయమ్మ మనస్థాపానికి గురైనట్లు సమాచారం. పిల్లలిద్దరి మధ్య నలిగి పోవడం కంటే.. ఎన్నికల అయ్యే వరకు విదేశాలకు వెళ్ళిపోవడమే మేలని స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే ఆమె అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే భర్త ఉన్నంతవరకు సామాన్య గృహిణిగా గడిపిన విజయమ్మ.. ఇప్పుడు పిల్లల పుణ్యమా అని ఇబ్బంది పడుతుండడాన్ని వైయస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.