కడప, ఏప్రిల్ 15
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీనే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. షర్మిల అన్నపై పోరాటంలో తగ్గకూడదని డిసైడయ్యాక.. చివరికి సెంటిమెంట్ రాజకీయాలు పండిస్తున్నారు. అన్న కోసం ప్రచారం చేయకుండా తల్లిని కూడా అమెరికా పంపించేశారు. ఇప్పుడు మరో సోదరి, వివేకా కుమార్తె సునీతతో కలిసి .. అన్యాయమైపోయిన ఆడబిడ్డమని అండగా ఉండాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ పండితే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందిక పరిస్థితులు ఎదురవుతాయి. కౌంటర్ గా ఎవరు సమాధానం ఇచ్చినా అది ప్రజల్లో మరింత చర్చకు కారణం అవుతుంది. అదే సమయంలో ఏమీ మాట్లాడకపోతే వారు చేస్తున్న ఆరోపణలు నిజమనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చాలనుకున్న షర్మిల ప్లాన్ లో వైసీపీ తప్పక భాగం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంగు చాచి అడుగుతున్నా ఆదరించండి అని షర్మిల అడుగుతున్న దృశ్యాలు కరుడుగట్టిన జగన్ అభిమానినైనా కాసేపు ఆలోచింప చేసేలా ఉన్నాయి. పులివెందులలో ప్రచారం చేస్తున్న షర్మిల, సునీత మహిళా సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని .. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అన్న జగన్ రెడ్డి రోడ్డున పడేశారని నేరుగా చెబుతున్నారు. ఆడిపిల్లలు అలా రోడ్డున పడి దీనంగా తమకు అండగా ఉండాలని వేడుకుంటూంటే.. ఓటర్లకు అయ్యో పాపం అనిపించక మానదు. జగన్ పై పోరాటంలో ఎక్కడా షర్మిల ఎక్కడా తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిల కడప లోక్ సభ బరిలోకి దిగారు. ఆమె ఒంటరి పోరాటం చేయాలి. పార్టీ సపోర్ట్ లేదు. తాను ఉన్న పార్టీకి క్యాడర్ లేదు. ఆర్థికపరమైన మద్దతు లభించదు. అన్ని సవాళ్లనూ ఒంటరిగా ఎదుర్కోవాలి. ఆయినా షర్మిల మొదటి అడుగు చాలా స్పష్టంగా వేశారు. ఓటింగ్ ఎజెండాను ఖరారు చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డకా... వివేకా హంతకుడిగా ఎవరికి ఓటేస్తారని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ స్ట్రాటజీ పవర్ ఫుల్ అనుకోవచ్చు. ఈ అంశాన్నే ప్రజల్లో చర్చకు పెడితే షర్మిల ప్రయత్నం సక్సెస్ అయినట్లే. అయితే ఇందులో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కడప జిల్లా వైఎస్ కుటుంబం కంచుకోట. ఆ కుటుంబం రాజకీయాల్లో నిలదొక్కుకున్న తర్వాత మరొకరు గెలిచిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు కడప లోక్ సభ నుంచి వైఎస్ కుటుంబసభ్యులే పోటీ పడుతున్నారు. అదీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలే తలపడుతున్నారు. వైసీపీ తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నా.. జగన్ పోటీ చేస్తున్నట్లే లెక్క. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆయనకు టిక్కెట్ కేటాయించారు. కాంగ్రెస్ తరపున వైఎస్ బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు. షర్మిలకు కుటుంబపరమైన సపోర్ట్ ఉంది. కానీ వారెవరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. చివరికి సొంత తల్లి కూడా షర్మిలకు మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి లేదు. విజయలక్ష్మి చాలా కాలంగా జగన్ తో పాటు ఉండటం లేదు. షర్మిలతోపాటే ఉంటున్నారు. విజయలక్ష్మి పుట్టిన రోజు నాడు.. చివరికి జగన్ పుట్టిన రోజు కూడా ఆమె జగన్ ఇంటికి వెళ్లడం లేదు. అయితే ఎన్నికల సమయం కావడంతో.. తల్లితో ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారు. షర్మిల కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఒకరికి అనుకూలంగా.. మరొకరికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేక అమెరికా వెళ్లిపోయారు. చాలా మంది బంధువులదీ అదే పరిస్థితి. కానీ అంతర్గతంగా ఎక్కువ మంది మద్దతు షర్మిలకే ఉంటుందని అంచనా వేస్తున్నారు. షర్మిల, సునీత చేస్తన్న ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఇబ్బందికరంగా మారడంతో మేనత్త విమలారెడ్డి రంగంలోకి దిగారు. షర్మిల, సునీత .. అవినాష్ రెడ్డిని హత్య చేస్తూంటే చూశారా అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ పరువును రోడ్డు మీదకు లాగుతున్నారని ఇకనైనా నోర్మూసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే విమలారెడ్డి వ్యాఖ్యలకు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కొడుకుకు జగన్ ఇచ్చిన కాంట్రాక్టులతో విమలారెడ్డికి బాగానే గిట్టుబాటు అయిందని .. అందుకే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విమలారెడ్డి స్పందనతో వివేకా హత్యకేసు విషయం మరింతగా చర్చల్లోకి వచ్చింది. రాజకీయాల్లో ప్రజాతీర్పును ఆషామాషీగా అంచనా వేయలేం. ఒకే ఒక్క అంశం ఎన్నికలను ఏకపక్షంగా మార్చేస్తుంది. కడపలో ఇప్పుడా వివేకా హత్య కేసు. వివేకాను ఎవరు హత్య చేశారో.. ఎవరు చేయించారో సీబీఐకి తెలియక పోవచ్చు కానీ సీఎం జగన్ చెప్పినట్లుగా కడప ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా షర్మిల, సునీత చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే.. ఓ నేరేషన్ క్రియేట్ చేసి ఎన్నికలకు వెళ్తున్నారు. షర్మిల ఎంపీ కావడం.. వైఎస్ వివేకా చివరి కోరికగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య ఎజెండాగానే ఎన్నికలు జరగాలని.. షర్మిల కోరుకుంటున్నారు. వైఎస్ తో అనుబంధం పులివెందుల ప్రజలకు ఎక్కువ కాబట్టి.. ఓటర్లలో మార్పు అనేది వస్తే అక్కడే తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే.. మొదటికే మోసం వస్తుంది. మొత్తంగా షర్మిల న్యాయం చేయాలన్న దీనమైన విజ్ఞప్తులతో ప్రజల్లోకి వెళ్తే... సెంటిమెంట్ పండుతుంది. దీనికి విరుగుడుగా భారతి వేసే ప్రణాళికలు కీలకం కానున్నాయి. లేకపోతే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని షర్మిల, సునీత నిరూపించే అవకాశం ఉంది.