తిరుపతి, ఏప్రిల్ 15
తిరుపతి జనసేనలో నెలకొన్న సంక్షోభాన్ని పవన్ కల్యాణ్ దాదాపుగా సర్దుబాటు చేశారు. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ఖరారు చేశారు. ఆయనకు వైసీపీ టిక్కెట్ నిరాకరిస్తే జనసేనలో చేరారని.. ఆయనకు తిరుపతి టిక్కెట్ కేటాయించడం ఏమిటని కూటమిలోని అన్ని పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకల్ నేతలను వదిలి బయట నుంచి వచ్చినవారికి టికెట్ ఇవ్వడంపై టీడీపీతోపాటు జనసేన నేతలు .. ఆయనను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతే కాదు పలుమార్లు కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహించారు. నాగబాబు ఒకటికి రెండు సార్లు వారిని పిలిపించుకుని మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అంతా సద్దుమణిగిపోయిందనకున్న వ్యవహారం రగులుతూనే ఉంది. జరుగుతున్న పరిణామాలు పార్టీ అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పవన్‌కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగేశారు. మంగళగిరి నుంచి శుక్రవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న పవన్‌కల్యాణ్ ముందుగా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వారి నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ రాయల్, టీడీపీ నేత సుగుణమ్మ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పొత్తుకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి నేతలతంతా అరణి శ్రీనివాసులును గెలిపించాలని నేతలను కోరారు. ఈ సారి ఎన్నికల్లో భూమన గెలిస్తే తిరుపతిలో ఎవరూ ఉండలేని పరిస్థితి వస్తుందన్నారు పవన్ కల్యాణ్. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు ప్రతీ ఒక్కరికీ తెలుసని, చివరకు తిరుమల కొండకు వెళ్లే పరిస్థితి లేదన్నారు టీడీపీ-జనసేన మధ్య ఓట్ల బదలాయింపు స్మూత్‌గా జరగాలంటే.. ఎలాంటి వివాదాలు .. అభిప్రాయబేధాలు ఉండకూడదన్నారు. చంద్రబాబు తో కలిసి హాజరవుతున్న సభలకు జనం నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోందని గుర్తు చేశారు. ఈ సమయంలో నేతలు కాస్త ఆలోచించాలన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఎన్నిబాధలు పడ్డారో తనకు తెలుసన్నారు పవన్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పడంతో నేతలు కాస్త మెత్తబడ్డారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డితోపాటు జనసేన నేత వినుతను సైతం పవన్ కలిసి మాట్లాడారు. కూటమి అభ్యర్థులు కొన్ని చోట్ల ఈగోకు పోయి ఇతర పార్టీల నేతల్ని కలుపుకుని వెళ్లడం లేదు. ఇలాంటి వారిని కూడా కూటమి నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కూటమిలోని నేతలతో ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా ఎన్నికల వరకూ పక్కన పెట్టాల్సిందేనని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. తిరుపతి విషయంలో పవన్ కల్యాణ్ బుజ్జగింపులు పూర్తి స్థాయిలో ఫలించినట్లేనని.. ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం జనసేన , టీడీపీ, బీజేపీ నేతలంతా ప్రయత్నించడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు.