విజయవాడ, ఏప్రిల్ 15
రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారు. రాయలసీమలో విజయవంతంగా ఈ యాత్ర పూర్తయింది. కానీ గుంటూరు జిల్లాకు వచ్చేసరికి యాత్ర తడబడింది. రకరకాల కారణాలు చెప్పి బస్సు యాత్రను నిలిపివేశారు. అయితే విజయవాడలో అడుగుపెట్టిన బస్సు యాత్రకు చిన్నపాటి అవాంతరం ఎదురయ్యింది. ఏపీ సీఎం జగన్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గులకరాయి విసిరారు. దీంతో ఆయనకు కంటి పై భాగంలో గాయమైంది. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. చంద్రబాబు పై నెపం వేస్తూ అంబటి రాంబాబు లాంటి నేతలు రంకెలు వేయడం ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఒక అధికారపక్ష నేతను టచ్ చేస్తారా? టచ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదా? అసలే సానుభూతికి బ్రాండ్ అంబాసిడర్ వైసిపి. అటువంటి వారిని కెలుకుతారా? అన్నది వైసీపీ నేతలకే తెలియాలి.గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య, అంతకుముందు కోడి కత్తి దాడి ఘటనను ఏ స్థాయిలో వాడుకున్నారు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గులకరాయి దాడి ఘటన వ్యూహంగా జరిగిందా? ప్లాన్ ప్రకారం జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఇది బయటపడుతుందా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. అయితే జగన్ పై రాయి దాడి అనగానే వైసిపి రంగంలోకి దిగింది. వైసీపీ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరికిందని భావించింది. భారీ యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. అయితే ఈ ఘటనను ప్రజలు లైట్ తీసుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఇది ఫ్రీ ప్లాన్ ఘటనగా నిర్ధారణకు వచ్చారు. అయితే విపక్షాల నుంచి ఆ స్థాయిలో ఎదురుదాడి కూడా ప్రారంభమైంది. ఈ కొత్త నాటకాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని విపక్ష నేతలు తేల్చి చెబుతున్నారు. పైగా ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవానికి జగన్ బస్సు యాత్రకు అనుకున్న స్థాయిలో ప్రజా స్పందన రావడంలేదని తెలుస్తోంది. జనం అంటే జగన్.. జగన్ అంటే జనం అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది. కానీ బస్సు యాత్రకు ఊహించినంతగా జనాలు రావడం లేదు. ఇప్పటివరకు బస్సు యాత్ర రాయలసీమలో విజయవంతంగా పూర్తయింది. కానీ గుంటూరులో అడుగుపెట్టిన నాటి నుంచి జనస్పందన తక్కువైంది. అందుకే బస్సుయాత్ర ఆపలేక.. కొనసాగించలేక సతమతమవుతున్నారని.. గులకరాయి ఎపిసోడ్ చూపించి.. శాంతిభద్రతలను సాకుగా చూపి బస్సు యాత్రను నిలిపి వేసేందుకే ఈ ప్లాన్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ పై గులకరాయి వచ్చిన మరుక్షణమే.. దాని వెనుక చంద్రబాబు ఉన్నారన్న ఆరోపణ ప్రజల ముందు తేలిపోయింది. సొంత పార్టీ శ్రేణులు సైతం సేమ్ సీన్ అంటూ లైట్ తీసుకున్నారు. రాయితో తగిలింది చిన్న గాయం. చిన్న బ్యాండేజ్ వేసుకున్నారు. మళ్లీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి డ్రెస్ వేసుకుని వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆ ఫోటోలను తీసుకొని మీడియాకు రిలీజ్ చేశారు. విపక్షాల ఐక్యతతో జగన్ మైండ్ బ్లాక్ అవుతోంది. మరోవైపు చెల్లెలు షర్మిల, మరో సోదరి సునీత వేస్తున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో గులకరాయితో దెబ్బ తగిలించుకోవడం.. సమస్యల నుంచి బయటపడడానికేనని విమర్శలు చుట్టుముడుతున్నాయి.