నాలుగేళ్ల మోదీ పాలనలో చిన్నపాటి అవినీతి, అక్రమాలు కూడా లేకుండా ఎంతో పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోతున్నారని, దేశంలో 21 రాష్ట్రాల్లో ఇవాళ బిజెపి అధికారంలో ఉందంటే దానికి మోదీ అవినీతి రహిత పాలనే కారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలపై సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు డాక్టర్ లక్ష్మన్ పాల్గొని ప్రసంగించారు. పేదరికంలో పుట్టి, స్వయంగా పేదరికాన్ని అనుభవించిన వ్యక్తిగా ప్రధాని నరేంద్రమోదీ పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. తన తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు చూసిన మోదీ.. ఏ తల్లికీ అలాంటి కష్టం రాకూడదన్న ఉద్దేశంతో దేశంలోని 8 కోట్ల మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, తెలంగాణలో 20 లక్షల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టారన్నారు.తాను అనుభవించిన కష్టాలు ఎవరూ అనుభవించకూడదని.. ప్రధానమంత్రిగా బాద్యత చేపట్టిన నాడే.. మోదీ స్పష్టం చేశారని, ఎర్రకోట నుంచి మాట్లాడుతూ...మరుగుదొడ్ల గురించి మాట్లాడిన ఏకైక ప్రధాని మోదీ అని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.ప్రతిఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చి మహిళల ఆత్మగౌరవయాలయాలుగా నామకరణం చేశారని, ప్రతి స్కూల్‌లో టాయిలెట్లు నిర్మింపజేసి బాలికలు మధ్యలో బడిమానేయకుండా చేశారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దాదాపు 3 లక్షల 60 వేలకు పైగా గ్రామాలు నేడు బహిరంగ మలవిసర్జన గ్రామాలుగా రికార్డు సృష్టించాయన్నారు. కార్మికులు, కర్షకులు, యువత, దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రధాని మోదీ చేపట్టిన వివిధ పథకాలు దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నాయని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. మోదీ చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ తనను ప్రపంచంలోనే మేటి ప్రధానిగా నిలిపాయన్నారు.
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లయినా.. దాదాపు 18 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేకుండేదని, మోదీ ప్రధాని అయిన తర్వాత 18 వేల గ్రామాల్లో విద్యుత్ వసతిని కల్సించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
చదువుకున్న దళిత యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు మోదీ ప్రభుత్వం కోటి రూపాయల వరకు ముద్రాయోజన కింద రుణాలుగా ఇస్తుందని, దీంతో ఇప్పటికే వేలాది యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.
అన్ని రాష్ట్రాల అభివృద్దే లక్ష్యంగా `14 వ ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా.. ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు.హృద్రోగ సమస్యలతో బాధపడే పేదలకు ఉపయోగ పడేలా స్టంట్‌ల ధరలను తగ్గించిన ఘనత మోదీదని, అలాగే తక్కువ ధరలో జనరిక్ మందులు అందుబాటులో ఉండేలా చర్చలు తీసుకున్నారని, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదల ఆరోగ్య భద్రత కోసం 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించారన్నారు.దళారలు పాత్ర లేకుండా జన్‌ధన్ యోజన లో భాగంగా 32 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారని, దీంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి సుకన్య యోజన, సురక్ష బీమా యోజన, బేటీ బచావో-బేటీ పడావో, బాలికా సమృద్ధి యోజన, మహిళలకు మెటర్నిటీ సెలవుల పెంపు, పంచాయతీలకు బలోపేతం చేసేందుకు తగినన్ని ఆర్థిక నిధులు అందిస్తున్నారన్నారు.
నాలుగేళ్ల మోదీ పాలనలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, పెద్దనోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశంలో ఆర్థికంగా దూసుకుపోతుందని, ప్రధానిగా నరేంద్రమోదీ తీసుకన్న నిర్ణయాలకు అన్ని వర్గాల ప్రజలు మద్ధతు తెలిపాలని డాక్టర్ లక్ష్మన్ కోరారు.చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో నిరంతర కాపలా కాస్తున్న సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు శతృవుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించేందు మోదీ ప్రభుత్వం తీసుకున్న సర్జికల్ స్ట్రైక్స్ నిర్ణయం భారత దేశ శక్తి సామర్ధ్యాన్ని ఇనుమడింపచేసిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.