విజయవాడ, ఏప్రిల్ 16,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18 రానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని కీలక పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మరో స్థాయి యుద్దమే నడుస్తుంది. కాగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కీలక నేతలను గెలిపించుకునేందుకు వారి భార్యలు రంగంలోకి దిగారు. ఎప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గోనని వారు కూడా ఈ సారి ప్రత్యక్ష్యంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వారిలో సీఎం జగన్ ను పులివెందులలో గెలిపించేందుకు వైఎస్ భారతి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు.అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కుప్పంలో మరోసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు బాబు భార్య భువనేశ్వరి ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే.. ఈ సారి నారా లోకే ను మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిపించాలనే తపనతో ఉన్న నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో పర్యటిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. విరితో పాటుగా హిందూపురంలో బాలయ్యను గెలిపించేందుకు ఆయన భార్య వసుంధర కూడా తన వంతు సహకారం అందిస్తున్నారు. పైన తెలిపిన నలుగురు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు కావడంతో వారు తమ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఆ సమయంలో వారి సతీమణులు ప్రచారంలో పాల్గొంటు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.