వైసీపీలో ధీమా సడలుతోందా? ఆ పార్టీ శ్రేణుల్లో భయం వ్యక్తం అవుతోందా? గెలుపు పై అపనమ్మకం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసిపి గ్రాండ్ విక్టరీ కొట్టింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. ఆ పార్టీ 151చోట్ల గెలుపొందింది. దేశంలోనే ఏ పార్టీ అంతలా విజయం నమోదు చేయలేదు. అందుకే ఈసారి జగన్ వై నాట్ 175 అన్న స్లోగన్ ను ముందుగానే ఇచ్చారు. అటు పార్టీ శ్రేణులు సైతం పెద్ద సౌండ్ చేశాయి. కానీ అది అంత సులువు అయ్యే పని కాదని సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న 151 స్థానాలు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.వాస్తవానికి ఏపీలో సంపూర్ణ విజయానికి జగన్ ఏనాడో శ్రీకారం చుట్టారు. 175 నియోజకవర్గాలకు గాను.. 175 చోట్ల గెలవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. చివరికి కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్ ను, హిందూపురంలో బాలకృష్ణను, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ ఓడించేలా భారీ ప్లాన్ రూపొందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు వర్క్ షాపులు నిర్వహించారు. సీరియస్ వార్నింగ్ లు ఇచ్చారు. గడపగడపకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వైసిపి నేతలకు పరిస్థితి తెలుసు. అందుకే అధినేత 175 అన్న నినాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 100 స్థానాలు వరకు గ్యారెంటీ అన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో 90 సీట్లు గెలిస్తే చాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ధీమా సడలడానికి, ఓటమి భయానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే పదవీకాలం ఉన్నా.. పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు టిడిపిలో చేరిపోయారు. టిక్కెట్లు వద్దనుకుని మరి ఎంపీలు పరారయ్యారు. ఈ ఒక్క కారణంతోనే వైసీపీ శ్రేణులు ఎక్కువగా భయపడుతున్నారు. పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంటే వీరందరూ ఎందుకు బయటకు వెళ్తారన్నదేవారి అనుమానానికి కారణం.తెలంగాణ ఉదంతామే ఒక ఉదాహరణ. అసలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ గేమ్ లో లేదు. కెసిఆర్ పార్టీకి తిరుగు లేదని భావించారు. కానీ రేసులో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగసి పడింది. తిరుగు లేదనుకున్న కేసీఆర్ పార్టీ చతికిల పడింది. ఇప్పుడు ఏపీలో కూడా ఆ పరిస్థితి రిపీట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే టిడిపి కూటమి కట్టిందో, ఆ కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చేరిందో.. అప్పటినుంచి ఒక రకమైన ఆందోళన అధికార పార్టీలో కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలకు భారీగా సమయం విపక్షాలకు చిక్కడంతో.. కూటమిలో అసంతృప్త స్వరాలు సర్దుకుంటున్నాయి. కూటమి పట్ల పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. రాజకీయంగా వైసిపికి చావు దెబ్బ తగలబోతోందన్న సంకేతం అందుతోంది. మరోవైపు ఈ గులకరాయి దాడి, సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత, విపక్షాలు బలపడడం తదితర కారణాలతో వైసిపి శ్రేణుల్లో ఒక రకమైన అలజడి నెలకొంది. అదే గెలుపు పై ధీమా సడలడానికి కారణమవుతోంది.