విశాఖపట్టణం, ఏప్రిల్ 16,
వేసవి వచ్చిందంటే దేశంలోని చాలా ప్రాంతాల్లో తాగు నీటి సమస్య తలెత్తుతుంది. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ ఏడాది వేసవి పూర్తిగా ప్రారంభం కావడాని కంటే ముందే నీటి సమస్య తలెత్తింది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అయితే రోజు వారి అవసరాలు తీర్చుకునేందుకు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. స్నానం చేయడానికి కూడా లిమిట్ విధించారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నీటి ఎద్దడి కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి.ఈ ఏడాదే ఈ సమస్య తలెత్తలేదు. ప్రతి ఏటా వేసవిలో బెంగళూరులో ఇదే పరిస్థితి. అయినా సరే ప్రభుత్వాలు మాత్రం మారడం లేదు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో.. బెంగళూరుకి ఆదర్శంగా నిలుస్తోంది మన వైజాగ్. గత ఐదేళ్లుగా వైజాగ్ లో ఇప్పటి వరకు నీటి సమస్య తలెత్తలేదు. అందుకు కారణాలు ఏంటి.. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే..1901, డిసెంబర్ 18న తొలిసారి విశాఖపట్నంలో వీధి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇండ్లలో ఏర్పాటు చేయలేదు. కేవలం వీధి కుళాయిలు మాత్రమే. అప్పుడు ధనవంతులు, ఉద్యోగులు ఇళ్లకి కావడీల ద్వారా నీటిని మోసేవారు ఉండేవారు. వీధి కొళాయిల వల్ల వారికి ఉపాధి దూరమైంది. నేడు విశాఖ మహానగరంగా ఎదిగింది. ప్రస్తుతం విశాఖ జనాభా సుమారు 22 లక్షలు. ఇప్పుడు వైజాగ్ కు ప్రతి రోజు 80 గ్యాలన్ల నీరు అవసరం. దీనిలో 15 మిలియన్ గ్యాలన్ల నీరు పరిశ్రమలకు కేటాయిస్తారు.విశాఖకు అవసరమైన నీరు ప్రధానంగా ఏడు మార్గాల ద్వారా వస్తుంది. అవి ఏలేరు, రైవాడ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడసర్లోవ, మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ల ద్వారా వైజాగ్ కు నీరు వస్తుంది. వీటిలో ప్రధానం ఏలేరు రిజర్వాయర్ నుంచే విశాఖకు అవసరమైన నీటిలో 60 శాతం వరకు వస్తుంది. ఇవి కాక నూతులు, బోర్ల ద్వారా 5.45 మిలియన్ల గ్యాలన్ల నీరు విశాఖకు వస్తుంది. ఇలా వచ్చిన నీటిని 11 ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ది చేస్తారు.భవిష్యత్తు అవసరాల కోసం 125 మిలియన్ గ్యాలన్ల నీటిని ఏలేరు నుంచి తరలించడం కోసం పైప లైన్ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 135 లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా.. విశాఖలో రోజుకు 110-115 లీటర్ల నీటిని సరఫరా చేయగల్గుతున్నట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు. విశాఖలో రోజు సగటున 45-60 నిమిషాల పాటు నీటిని సరఫరా చేస్తారు.వేసవిలో రిజర్వాయర్లతో పాటుగా నగర నీటి అవసరాలను తీర్చడం కోసం 8,400 బోర్లు కూడా ఉన్నాయి. ఏటా వేసవి మొదలయ్యేసరికి.. జూలై వరకు అవసరమయ్యే నీటిని నిలవ చేస్తామని.. గత ఐదేళ్లుగా ఇలానే చేస్తున్నామని.. అందుకే వేసవిలో విశాఖలో నీటి సమస్య రాలేదని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా బెంగళూరు అధికారులు మేల్కొని.. వచ్చే ఏడాది అయినా.. వైజాగ్ లో తీసుకుంటున్నట్లుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.