విజయవాడ, ఏప్రిల్ 18
నారా భువనేశ్వరి అంటే.. ఎన్టీఆర్ కుమార్తె కంటే చంద్రబాబునాయుడు సతీమణిగానే ఎక్కువ పరిచయం. దశాబ్దాల పాటు అందరికీ తెలిసినప్పటికీ ఆమె బహిరంగంగా మాట్లాడింది చాలా తక్కువ. చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే... భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీని వృద్ధిలోకి తీసుకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు చూసుకున్నారు. అంతే కానీ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. కానీ చంద్రబాబునాయుడ్ని స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె తెర ముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్టు కారణంగా మనస్థాపానికి గురైన మరణించిన కుటుంబాలను పరామర్శించి .. ఆర్థిక సాయం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త టూర్ నిర్వహించారు. నిజం గెలవాలి పేరుతో నిర్వహించిన యాత్ర ఆమెలో రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది. ఎన్టీఆర్ కుమార్తె , చంద్రబాబునాయుడు సతీమణి అయినప్పటికీ రాజకీయాల జోలికి ఎప్పుడూ రాలేదు. కనీసం పార్టీ కోసం ప్రచారం కూడా ఎప్పుడూ చేయలేదు. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్ంగలోనూ ఆమె పర్యటించి రాజకీయం చేసిన సందర్భాలు తక్కువే. పూర్తిగా వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు. భవిష్యత్ లో కూడా ఆమె రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ అనుకోలేదు. నారా లోకేష్ ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక భువనేశ్వరి రాజకీయాల్లోకి రాననుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్ట్ ఒక్క సారిగా రాజకీయ పరిణామాల్ని మార్చేసింది. ఆమె ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే నిజం గెలవాలి యాత్రను ప్రారంభించారు. మొదట చిత్తూరు జిల్లాలో తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఉత్తరాంధ్రలో పర్యటన ప్రారంభించినప్పుడే చంద్రబాబునాయుడుకు బెయిల్ రావడంతో యాత్ర తాత్కలికంగా నిలిపివేశారు. కాస్త విరామం తర్వాత అన్ని జిల్లాలు పర్యటించారు. ఆమె చేసింది రాజకీయ పర్యటనలు కాదు..కానీ అక్కడి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగాలు సంపూర్ణ అవగాహనతో .. స్పష్టతతో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాలపై ఇంత అవగాహన ఉండి .. ఎన్టీఆర్ కుమార్తెగా ఉండి.. ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఏమిటని అనుకున్నారు. ఇంట్లో అందరూ రాజకీయాలు చేయడం ఎందుకని ఆమె రాజకీయాల జోలికి రాలేదమో కానీ.. ఇప్పుడు నారా బ్రహ్మణి హెరిటేజ్ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఆ సంస్థను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు భువనేశ్వరి కూడా కాస్త తీరికగా ఉన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు అరెస్టు రాజకీయంగా తన ప్రభావాన్ని చూపించాడనికి ఉపయోగపడింది. రాష్ట్ర వ్యాప్త పర్యటన తర్వాత నారా భువనేశ్వరి కూడా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. నిజం గెలవాలి యాత్రతో వచ్చిన కాన్ఫిడెన్స్ తో .. మరో యాత్ర చేసేందుకు నారా భువనేశ్వరి సిద్ధమవుతున్నారు. మహిళల్ని ఆకట్టుకునే అవకాశాలు ఉండటంతో తెలుదేశం పార్టీ నాయకత్వం కూడా నారా భువనేశ్వరిని ఎన్నికల ప్రచారం దిశగా ప్రోత్సహిస్తున్నారు. త్వరలో చంద్రబాబు, లోకేష్‌లతో పాటు నారా భువనేశ్వరి కూడా రాజకీయ ప్రచార సభల్లో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇలా ప్రచారం చేసే నేతలు ఎక్కువగా ఉన్నట్లు అవుతుంది. క్రౌడ్ పుల్లర్స్ గా ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వరి కూడా వస్తే మహిళా కోటాలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. నేరుగా ఎన్టీఆర్ కుమార్తె లేదా చంద్రబాబునాయుడు సతీమణి హోదాలో రాజకీయాల్లోకి వస్తే అంత ఇంపాక్ట్ ఉండదు. ప్రజల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేస్తే.. ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేకపోయినా.. భవిష్యత్ లో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం. భువనేశ్వరికి కూడా రాజకీయంగా ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగ శైలి.. ఉందని స్పష్టమైన తర్వాత ఆమె సేవల్ని టీడీపీ వినియోగించుకోకుండా ఉండదు. ప్రజాప్రతినిధిగా ఎన్టీఆర్ బిడ్డగా ప్రజల మన్నన్నల్ని ఆమె పొందుతారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. భువనేశ్వరి సోదరి పురందేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కీలకమైన స్థానంలో ఉన్నారు. ప్రతిభావంతురాలైన రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.