తిరుపతి, ఏప్రిల్ 18,
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తిరుపతిలో మూడు పార్టీల్లో మనుషులు కలిసినా మనసులు కలవని పరిస్థితి నెలకొంది. అధినేతలు ఆదేశించినా నేతల మధ్య దూరం తగ్గకపోవడంతో ప్రచారం ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఆత్మీయ సమావేశాలకే కూటమి పరిమితం అయ్యింది.తిరుపతిలో కూటమి రాజకీయం కాక రేపుతోంది. పొత్తుల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సైకిల్ పార్టీకి అవకాశం దక్కకపోవడం ఇబ్బందిగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి తిరుపతి సెంటిమెంట్‌గా భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో సింబల్ లేకపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారి టీడీపీ గుర్తు ఈవీఎంల్లో కరువైంది.తిరుపతి అసెంబ్లీ పొత్తులో భాగంగా జనసేనకు, తిరుపతి పార్లమెంట్ టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ స్థానిక నాయకత్వం డీలాపడింది. కూటమి అభ్యర్థిగా తిరుపతి అసెంబ్లీకి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి వరప్రసాద్ పోటీ చేస్తుండటంతో టీడీపీ స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో మూడు పార్టీల జెండాలతో ప్రచారం ప్రారంభం కాలేకపోతోంది. ఒకవైపు వైసీపీ దూకుడుగానే ప్రచారం చేస్తుండగా కూటమి అభ్యర్థులు మాత్రం ఇంకా ఆత్మీయ సమావేశాలు అలకలు తీర్చే పనిలోనే ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రచారానికి దూరంగానే ఉన్న జనసేన, బీజేపీ అభ్యర్థులు టీడీపీతో పాటు సొంత పార్టీలోని అసమ్మతి నేతల్ని దారికి తెచ్చుకోలేక పోతున్నారు. వైసీపీ అభ్యర్థులు చేస్తున్న దూకుడు ప్రచారానికి కళ్లెం వేయలేకపోతున్నారు. టిడిపి, జనసేనలో ఉన్న అసమ్మతి నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.సమావేశాలు, అలకలు తీర్చే పనిలోనే నిమగ్నమైన కూటమి అభ్యర్థులు ఎన్నికల కదనరంగంలో దిగని పరిస్థితి నెలకొంది. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులుకు తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ సహకరించకపోగా టీడీపీ తిరుపతి ఇంచార్జ్ సుగుణమ్మ, ఇతర నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తిరుపతి టీడీపీలోని 12 మంది క్లస్టర్ ఇంచార్జులు, టీడీపీ టికెట్‌ను ఆశించిన ఆశావాహులు జేబి శ్రీనివాస్, ఊకా విజయ్ కుమార్ మొదటి నుంచి ప్రచారంలో దూరంగానే ఉన్నారు. ఈ మధ్యనే శ్రీకాళహస్తి పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులుకు సహకరించాలని ఆదేశించారు. అయినా చేతులు కలపని పరిస్థితి నెలకొంది. తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మినహా ఎవరూ ఆరని శ్రీనివాసులు వైపు చూడని పరిస్థితి ఏర్పడింది.మరోవైపు ఆరని శ్రీనివాసులుకు సొంత పార్టీలోనూ పూర్తి సహకారం అందడం లేదు. జనసేనలోని కొద్దిమంది మాత్రమే శ్రీనివాసుల వెంట నడుస్తున్న పరిస్థితి నెలకొంది. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరని శ్రీనివాసులుకు సహకరించేది లేదని జనసేన హైకమాండ్‌కు తేల్చి చెప్పేశారట. ఇక, బీజేపీలోనూ ప్రచారం ఊపందుకోవడం లేదు. తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా చంద్రబాబు ప్రజాగళంలో, తిరుపతిలో బీజేపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో మినహా ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రచారంలోనూ ఎక్కడా కనిపించ పోవడంతో వైసీపీ దూకుడు ప్రచారానికి దీటుగా కూటమి అభ్యర్థులు జనం ముందుకు రాలేకపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అటు టీడీపీ ఇటు జనసేన కేడర్ లో స్తబ్దత నెలకొంది.