విజయవాడ, ఏప్రిల్ 19
ఏపీలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. అక్కడ వల్లభనేని వంశీ మోహన్ ప్రాతినిధ్యం వహించడమే అందుకు కారణం. గత ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల కంటే ఘోరంగా తెలుగుదేశం నాయకత్వంపై మాట్లాడడంలో వంశీ ముందుండేవారు. అందుకే ఈసారి ఎలాగైనా వంశీని ఓడించాలని టిడిపి ప్రయత్నిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో దించుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వంశీ గెలవకూడదు అన్న కృత నిశ్చయంతో టిడిపి ఉంది.గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీయే గెలుస్తోంది. అయితే ఇందులో రెండుసార్లు వంశి ఎమ్మెల్యేగా గెలవగా.. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి అయ్యారు. గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టిడిపి అభ్యర్థిగా మారారు. వంశీ వైసీపీలోకి ఫిరాయించడంతో.. వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావును టిడిపిలోకి రప్పించి టికెట్ కట్టబెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపు పై గట్టి ధీమాతో ఉన్నారు.యార్లగడ్డ వెంకట్రావు బలమైన అభ్యర్థి. ఈ నియోజకవర్గ టిడిపికి కంచుకోట కావడంతో కలిసి వచ్చే అంశం. పైగా వల్లభనేని వంశీ మోహన్ చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. నియోజకవర్గంలోని కమ్మ సామాజిక వర్గం ఏకతాటి పైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉంది. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతోంది. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ కు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. వైసిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో కలిసి వస్తుందని వంశీ భావిస్తున్నారు. అయితే ఇరుపాక్షాల్లో కూడా విజయంపై ధీమా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది.