నెల్లూరు, ఏప్రిల్ 19
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి దాపురించాయి. కేంద్రంలోని బిజెపి టిడిపి తో చేతులు కలిపింది. తెలంగాణలో తనకు వ్యతిరేకమైన కాంగ్రెస్ సర్కారు ఉంది. సొంత కుటుంబంలోనే వ్యతిరేకులు ఎక్కువయ్యారు.విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇన్ని పరిణామాల నడుమ జగన్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఒంటరి అయ్యారు. గత ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు సేమ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. చంద్రబాబు రెక్కలు విరిచి మరి జగన్ ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో పాటు కెసిఆర్ పాటుపడ్డారు. కానీ ఈసారి ఒక్క అంశం కూడా జగన్కు కలిసి రావడం లేదు. అందుకే ఆయన కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడుతున్నారు. సంక్షేమం పొందిన ప్రతి కుటుంబం తనకు అండగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చాలా సర్వేలు వచ్చాయి. వైసిపి భారీ విక్టరీ సాధిస్తుందని అంచనాలు వెల్లడించాయి. కానీ తెలుగుదేశం పార్టీ లైట్ తీసుకుంది. అవన్నీ పెయిడ్ సర్వేలని కొట్టి పారేసింది. లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించామని.. మంచి సంక్షేమాన్ని అందించామని.. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని చంద్రబాబు భావించారు. రాజధాని, పోలవరం, విద్యుత్ విషయాల్లో ప్రజలను మెప్పించామని సంతృప్తి పడ్డారు. తామే కొన్ని రకాల సర్వేలు చేపట్టి అనుకూల ప్రకటనలు ఇప్పించుకున్నారు. కానీ ఫలితాలు వచ్చాక తేలింది తన అభిప్రాయం తప్పు అని. తమకంటే ముందు వైసీపీ విష ప్రచారానికి దిగిందని గుర్తించారు. ఇప్పుడు కూడా వైసీపీ చేస్తున్న తప్పిదం అదే.గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అమలు చేశామని.. నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేశామని.. అందుకే అంత తమకే ఓట్లు వేస్తారని వైసీపీ నేతలు ఆశపడుతున్నారు. జాతీయ సర్వేలను తప్పుపడుతున్నారు. కూటమికి అనుకూలంగా వచ్చే సర్వేలను ఫేక్ గా తేల్చుతున్నారు. వాస్తవానికి సర్వే సంస్థలను వైసీపీయే కొనుగోలు చేస్తోందని.. ఆ పార్టీకే అటువంటి ఆలోచన, ఆర్థిక పరిస్థితి ఉందన్నది సగటు ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అయితే ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉందని తెలిసి కూడా వైసిపి అనుకూల సర్వే సంస్థలు.. ఏకపక్షంగా ఫలితాలను కట్టబెడుతున్నాయి. ఇక్కడే అనుమానాలకు బలం చేకూరుతోంది. అనుకూలంగా వస్తే ఒకలా..ప్రతికూలంగా వస్తే వైసీపీ వ్యవహరిస్తుండడం కూడా ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అంతిమంగా అది వైసీపీకి నష్టం చేకూరుస్తుంది.